Let's talk: editor@tmv.in
కోచింగ్ సెంటర్లు - విద్యా వ్యవస్థలోని లోపాలా?

కోచింగ్ సెంటర్లు - విద్యా వ్యవస్థలోని లోపాలా?

Dr.Chokka Lingam
26 నవంబర్, 2025

పార్లమెంటులో ఇటీవల ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ కోచింగ్ సెంటర్ల విస్తరణపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో దేశవ్యాప్త చర్చ మొదలైంది. రాజస్థాన్ లోని కోటా నుండి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు వరకు, ఢిల్లీ నుండి చెన్నై వరకూ కోచింగ్ సెంటర్ల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. కుటుంబాలు లక్షలు ఖర్చు చేస్తున్నాయి, విద్యార్థులు యువ శక్తిని పుస్తకాల్లో పాతిపెడుతున్నారు. కానీ ఓ ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ఈ కోచింగ్ సెంటర్లు నిజంగా విలువను జోడిస్తున్నాయా? లేక మన విద్యా వ్యవస్థ అసమర్థతను కప్పిపుచ్చుతున్నాయా?

సత్యం ఈ రెండు అంచుల మధ్యే ఎక్కడో ఉంది.

మన పాఠశాల లోపాల పుట్ట. అధికభారంతో ఉన్న సిలబస్, పాత పద్ధతుల బోధన, నిబద్ధత లేని ఉపాధ్యాయులు ఇవి పోటీ పరీక్షల అవసరాలకు సరిపోలేవు. పాఠశాలలు అందించలేని ఈ ‘ఎగ్జామ్–రెడీ’ శిక్షణను కోచింగ్ సెంటర్లు వాణిజ్య అవకాశంగా గుర్తించాయి. అందువల్ల ఇవి పెరగడం యాదృచ్ఛికం కాదు.అది వ్యవస్థాపక బలహీనతల ఫలితం. కానీ, ఒక దేశం తన ప్రతిభావంతులైన యువతను సిద్ధం చేయడానికి పాఠశాలలతో పాటు ఇంకో విద్యా వ్యవస్థను నిర్మించుకోవడం ఎంతవరకు ఆరోగ్యకరం?

కోచింగ్ సెంటర్లు క్రమశిక్షణ, కఠినమైన అభ్యాస వాతావరణం, అనుభవజ్ఞులైన గురువులు, నిరంతర మాక్ టెస్టులు, సమయపాలన వంటి ప్రయోజనాలను ఇస్తాయి అని కోచింగ్ అనుకూలుల వాదన. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు దారిని చూపుతాయి. నిజమే, అనేక విజయవంతులైన అభ్యర్థుల ప్రయాణంలో కోచింగ్ పాత్ర బలంగా కనిపిస్తుంది. అయితే విమర్శకులు ఒక చేదు వాస్తవాన్ని గుర్తుచేస్తారు. కోచింగ్ లేకుండా విజయం అసంభవం అయితే, మన పాఠశాల వ్యవస్థలో నిజంగా ఏమి జరుగుతోంది? పాఠశాలలు సర్టిఫికెట్లు ఇస్తాయి, కోచింగ్‌లు అసలు సామర్థ్యాన్ని నిర్మిస్తాయి అనే భావన పెరుగుతోంది. ఇది ప్రమాదకరం.

ఇంకా ముఖ్యమైన విషయం కోచింగ్ సెంటర్లు అందించే “విలువ” అసలు జ్ఞానం కాదు; పరీక్ష వ్యూహం మాత్రమే. షార్ట్‌కట్‌లు, మాక్ టెస్టులు, ప్రశ్నల ధోరణి విశ్లేషణ ఇవి పాఠశాలల్లో ఉండాలి కానీ ఉండడం లేదు. ఫలితంగా విద్య వాణిజ్యమైనదై, విద్యార్థి ఒత్తిడికి గురవుతున్నాడు. కోటా వంటి నగరాల్లో విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల ఘటనలు దీని తీవ్రతను చూపుతున్నాయి. కోచింగ్ సెంటర్లు వ్యాపార సంస్థలే వాటికి భావోద్వేగాల కంటే ఫీజులు ముఖ్యమైనవి. కానీ కోచింగ్‌ను నిషేధించడం పరిష్కారం కాదు. డిమాండ్ ఉన్న చోట సరఫరా తప్పదు. దేశంలో కొన్ని వేల సీట్లు కోసం లక్షల మంది పోటీ పడుతున్న మాట వాస్తవం. మనము వీటిపై ఎంతవరకు ఆధారపడాలి? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

సమతుల్యతే పరిష్కారం.

మొదట, పాఠశాల విద్యనే బలపరచాలి. పాఠశాలలు విజ్ఞానం మాత్రమే కాక, పరీక్ష సిద్ధతలోనూ నైపుణ్యాన్ని ఇవ్వాలి. రెండవది, పరీక్షల రూపకల్పనను పునర్విమర్శించాలి. రెండు సంవత్సరాల తీవ్ర కోచింగ్ లేకుండా ర్యాంక్ సాధించలేని పరీక్షలు అసమతుల్యంగా మారాయి. మూడవది, కోచింగ్ సెంటర్లపై నియంత్రణ తప్పనిసరి. ఫ్యాకల్టీ అర్హతల నుండి ఫీజుల వరకు, ప్రకటనల నియంత్రణ నుండి విద్యార్థి కౌన్సెలింగ్ వరకు నియమావళి అవసరం. పారదర్శకత లేకుండా పెరుగుతున్న ఈ రంగం విద్యార్థిపై భారంగా మారుతోంది.

అత్యంత ముఖ్యమైనది కోచింగ్‌ల లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఇవి కేవలం విద్యార్థికి సహాయకారులే కానీ ప్రధాన విద్యా వేదికలు కావు. పాఠశాల విద్యకు ప్రత్యామ్నాయాలు కావు. పరీక్షలో ర్యాంకులు సాధించడం మాత్రమే విద్య లక్ష్యం కాదు. యువతకు ధైర్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం ఇవి పాఠశాలల నుంచే రావాలి.

ఇప్పుడు పార్లమెంటు కమిటీ సమీక్ష ఒక సదవకాశం. విద్యార్థి కేంద్రంగా, ఒత్తిడిని తగ్గించేలా, పాఠశాల-కోచింగ్ మధ్య సమతుల్యత తెచ్చేలా సంస్కరణలు అవసరం. మన భవిష్యత్తు ఉన్నత స్థానాల్లో నిలుస్తుందా? లేదా కోచింగ్ గదుల గోడల మధ్యే పరిమితమైపోతుందా? అన్నది ఈ నిర్ణయాల పై ఆధారపడి ఉంది

కోచింగ్ సెంటర్లు - విద్యా వ్యవస్థలోని లోపాలా? - Tholi Paluku