Let's talk: editor@tmv.in
కోకాపేట శారదా పీఠం భూములపై క్లారిటీ: జలమండలి కేటాయింపుల రద్దుకు సీఎం ఆదేశం

కోకాపేట శారదా పీఠం భూములపై క్లారిటీ: జలమండలి కేటాయింపుల రద్దుకు సీఎం ఆదేశం

Gaddamidi Naveen
1 మార్చి, 2026

హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో శారదా పీఠానికి కేటాయించిన భూముల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ భూములను తిరిగి పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో, అక్కడ ఇప్పటికే పీఠం ఆధ్వర్యంలో సాగుతున్న నిర్మాణ పనుల విషయాన్ని పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోకాపేట భూముల్లో శారదా పీఠం చేపట్టిన వివిధ నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులను అధికారుల ద్వారా వివ‌రాలు తెలుసుకున్నారు. భూములను జల మండలికి కేటాయించే సమయంలో అక్కడ జరుగుతున్న నిర్మాణాల స్థితిని పూర్తిగా వెల్లడించకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల కేటాయింపులో స్పష్టత లేకపోవడం, పీఠం కార్యకలాపాలకు ఆటంకం కలగడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, జల మండలికి చేసిన కేటాయింపులను రద్దు చేసి ఆ భూములను తిరిగి శారదా పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ నిర్ణయంతో కోకాపేట భూవివాదానికి తెరపడినట్లయింది. అదనంగా, మంత్రి శ్రీధర్ బాబు‌ను కలిసి నిర్మాణాల ప్రగతి, ఇతర పరిపాలనా విషయాలపై పూర్తి వివరాలు అందించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు. ఈ నిర్ణయం ద్వారా పీఠం చేపట్టిన ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.

కోకాపేట భూములపై హరీష్ రావు స్పందన

కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించారు. దీనిని 'రాజ శ్యామలా దేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం'గా ఆయన అభివర్ణించారు. భక్తుల పోరాటానికి దక్కిన విజయమని పేర్కొంటూ, ముఖ్యమంత్రికి అమ్మవారు ఇప్పటికైనా సరైన బుద్ధి ప్రసాదించినందుకు సంతోషమని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.

అయితే, ఇదే సమయంలో ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా, ప్రజా ప్రయోజనం లేకుండా సీఎం అల్లుడి అనుయాయులకు హెచ్ఎండీఏ ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏంటని ప్రశ్నించారు. అక్కడ కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.