Let's talk: editor@tmv.in
కొసావో ప్రధానిగా మరోసారి అల్బిన్ కుర్తీ

కొసావో ప్రధానిగా మరోసారి అల్బిన్ కుర్తీ

Shaik Mohammad Shaffee
13 ఫిబ్రవరి, 2026

బాల్కన్ ప్రాంతంలోని కొసావోలో సుమారు ఏడాది కాలంగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా సంస్కరణవాద నేత, 'సెల్ఫ్ డిటర్మినేషన్ మూమెంట్' (ఎల్‌వీవీ) అధ్యక్షుడు అల్బిన్ కుర్తీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం రాత్రి జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో కుర్తీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గానికి ఎంపీలు ఆమోదముద్ర వేశారు. 120 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆయనకు అనుకూలంగా 66 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 49 ఓట్లు పడ్డాయి. దీంతో 2021 మార్చి తర్వాత ఆయన వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని అధిరోహించినట్లయింది.

సొంత బలం.. మైనారిటీల అండ

గతేడాది డిసెంబర్ 28న జరిగిన ముందస్తు ఎన్నికలలో అల్బిన్ కుర్తీ పార్టీ (ఎల్‌వీవీ) ఘనవిజయం సాధించింది. పార్లమెంటులో మొత్తం 120 స్థానాలకు గానూ ఈ పార్టీ ఒంటరిగానే 57 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పక్షాల్లో డెమొక్రటిక్ పార్టీ (పీడీకే) 22, డెమొక్రటిక్ లీగ్ (ఎల్‌డీకే) 15, మాజీ ప్రధాని హరాదినాజ్ పార్టీ (ఏఏకే) 6 స్థానాలను గెలుచుకున్నాయి. పూర్తి మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోయిన కుర్తీ.. ఇతర మైనారిటీ గ్రూపుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల తర్వాత పార్లమెంటు తొలిసారి సమావేశమైన కొద్ది గంటల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడం విశేషం.

కొత్త కేబినెట్.. కీలక బాధ్యతలు

అధికార పగ్గాలు చేపట్టిన కుర్తీ, తన మంత్రివర్గంలో సమర్థులకు చోటు కల్పించారు. గ్లాక్ కొంజుఫ్కాను ఉప ప్రధాని, విదేశాంగ మంత్రిగా, జెల్లాల్ స్వెట్లాను అంతర్గత వ్యవహారాల మంత్రిగా, ఏజుప్ మాకెడోన్సిని రక్షణ మంత్రిగా నియమించారు. పార్లమెంటు స్పీకర్‌గా అల్బులెనా హక్సియు ఎన్నికయ్యారు. అయితే ఈ కేబినెట్ కూర్పుపై స్థానిక సెర్బ్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. తమ వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపిస్తూ సెర్బ్ లీస్ట్ పార్టీ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించింది.

యుద్ధం నుంచి స్వాతంత్ర్యం వరకు

ఒకప్పుడు సెర్బియాలో భాగంగా ఉన్న కొసావో చరిత్ర రక్తసిక్తమైన పోరాటాలతో కూడుకున్నది. 1998-99 మధ్య ఇక్కడ జరిగిన యుద్ధం, అమెరికా నేతృత్వంలోని నాటో దళాల జోక్యంతో ముగిసింది. ఆ తర్వాత 2008లో కొసావో తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని సెర్బియా ఇప్పటికీ గుర్తించడం లేదు. దీనివల్ల ఈ రెండు దేశాల మధ్య, ముఖ్యంగా కొసావో ఉత్తర ప్రాంతంలోని సెర్బ్ కమ్యూనిటీ నివసించే చోట ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

యుద్ధ నేరాల వ్యాఖ్యలతో దుమారం

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుర్తీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. గతంలో తమ విముక్తి సైన్యం (కేఎల్ఏ) ఎలాంటి పౌర నేరాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటులో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టులో తమ మాజీ నేతలకు 45 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది తమ పోరాట చరిత్రను తక్కువ చేయడమేనని మండిపడ్డారు. అదే సమయంలో నాటి యుగోస్లేవియా అధ్యక్షుడు స్లోబోదాన్ మిలోసెవిచ్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు గుప్పించారు.

ముందున్న సవాళ్లు

కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుర్తీ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా సెర్బియాతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడం, అంతర్జాతీయ సమాజంలో కొసావోకు పూర్తిస్థాయి గుర్తింపు తీసుకురావడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. మరోవైపు, స్థానిక సెర్బ్ వర్గాల నిరసనలను శాంతింపజేయడం కూడా ఆయనకు కత్తి మీద సాము వంటిదే. డిసెంబర్ ఎన్నికల తర్వాత కొలువుదీరిన ఈ కొత్త ప్రభుత్వం, దేశంలో ఇకనైనా స్థిరమైన పాలన అందిస్తుందని సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు.