
కొవ్వూరు రైల్వే బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. సినిమా చూడాలని ఉత్సాహంగా బయలుదేరిన యువకుల ప్రయాణం ప్రాణాంతకంగా ముగియడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
సోమవారం రాత్రి కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన పోతుగుంట అక్షయ్‌కుమార్ (20), తగరపు సత్యకళ్యాణ్ అలియాస్ సునీల్ (20), కొమిరి ఏడుకొండలు (18) ముగ్గురు కలిసి పల్సర్ బైక్‌పై రాజమండ్రి వైపు సినిమా చూసేందుకు బయలుదేరారు. అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ (34) యాక్టివా స్కూటీపై కొవ్వూరు వైపు వస్తున్నారు.
కోవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై 104వ స్తంభం సమీపంలో బైక్, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్షయ్‌కుమార్, సునీల్, లక్ష్మీనారాయణలకు తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ఉన్న ఏడుకొండలుకు గాయాలు కాగా, 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం రాజమండ్రి ఆసుపత్రికి రిఫర్ చేశారు.
సమాచారం అందగానే పట్టణ సీఐ పి.విశ్వం పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం వల్ల రైల్వే బ్రిడ్జిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వెంటనే రాకపోకలను పునరుద్ధరించారు.
అతివేగం నియంత్రణ లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరదాగా బయలుదేరిన యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల రోదనలు హృదయవిదారకంగా మారాయి.
