
కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఏకపక్ష విజయం: మంత్రి జూపల్లి ధీమా
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మంత్రి జూపల్లి కృష్ణారావు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులను అభినందించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం కొల్లాపూర్ 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల సుజాతకు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే కొల్లాపూర్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
కొల్లాపూర్ పట్టణంలోని 19 వార్డులకు గాను అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కొల్లాపూర్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, కబ్జాలు, దౌర్జన్యాలు, లంచగొండితనం ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ఆ అక్రమాలను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధనబలం ఉన్న నేతను ఇంచార్జ్‌గా నియమించి డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అలాంటి ప్రయత్నాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పట్టణంలోని వీధుల్లో చిరువ్యాపారులతో మంత్రి మాట్లాడారు. ప్రజాప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న పథకాలను వారికి వివరించారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
