Let's talk: editor@tmv.in
కొలిక్కి వచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ

కొలిక్కి వచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ

Panthagani Anusha
31 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో జిల్లాల సరిహద్దుల మార్పులు, కొత్త జిల్లాల ఏర్పాటుపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26 నుంచి 28కి పెంచుతూ మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంపులశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వివరించారు.

17 జిల్లాల్లో మార్పులు.. 25 కీలక సవరణలు

జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల పరిధుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తుల మేరకు ఈ 17 జిల్లాల్లో మొత్తం 25 రకాల సవరణలు చేశారు. అయితే పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేని విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాలను మాత్రం యథాతథంగా ఉంచినట్లు మంత్రి స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా ప్రధాన మార్పులు

ప్రధాన మార్పుల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలను కలిపి ఈ నూతన జిల్లాను రూపొందించారు. ఈ విధంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని 'పోలవరం' జిల్లాగా ప్రకటించారు. భవిష్యత్తులో పోలవరం గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, దానిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారుస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రాయచోటిని విడిగా జిల్లాగా చేసే అవకాశం లేనందున అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రాంతీయ విజ్ఞప్తుల మేరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య సరిహద్దు మార్పులు జరిగాయి. గూడూరు డివిజన్‌లోని కోట, చిలకూరు, గూడూరు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో చేర్చగా దిగువన ఉన్న రెండు మండలాలను తిరుపతి జిల్లాలోకి మార్చారు. ప్రకాశం జిల్లా ప్రజల కోరిక మేరకు అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల నుండి విడదీసి తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రాయలసీమ ప్రాంతంలో రాజంపేట నియోజకవర్గాన్ని తిరిగి కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి మారుస్తున్నట్లు మంత్రిమండలి పేర్కొంది. అదేవిధంగా సిద్ధవటం, ఒంటిమెట్ట మండలాలను కడపలోనే కొనసాగిస్తున్నారు. వీటితో పాటు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు మడకశిరను రెవిన్యూ డివిజన్‌గా, బనగానిపల్లెను, అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డును సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఆదోనిలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా దానిని ఆదోని-1, ఆదోని-2 మండలాలుగా విభజించారు.

ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే 2025 నవంబర్ 27న గెజిట్ జారీ చేసి, డిసెంబర్ 27 వరకు అభ్యంతరాలను స్వీకరించినట్లు మంత్రి తెలిపారు.ఈ మార్పులన్నింటినీ క్రోడీకరిస్తూ ప్రభుత్వం వెనువెంటనే తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాటు జరిగిన మార్పులన్నీ 2025, డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.