
కొలిక్కిరాని అణు చర్చలు.. ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికా!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై సైనిక దాడులు చేసేందుకు అమెరికా సమాయత్తమవుతోంది. ఈ వారంతంలోనే ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. అయితే ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య అణు ఒప్పందంపై జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడమే ఈ తాజా ఉత్కంఠకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
చర్చలు జరిగాయి.. కానీ
అణు ఒప్పందంపై జెనీవాలో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అధికారులతో జరిపిన చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య ఇంకా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. "కొన్ని విషయాల్లో పురోగతి ఉన్నా, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. రాబోయే రెండు వారాల్లో ఇరాన్ మరిన్ని వివరాలతో వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు" అని లీవిట్ పేర్కొన్నారు. సైనిక చర్య కంటే దౌత్యానికే తమ అధ్యక్షుడు మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెబుతూనే.. అమెరికాతో ఒప్పందానికి రావడం ఇరాన్‌కే శ్రేయస్కరమని ఆమె పరోక్షంగా హెచ్చరించారు.
అంతర్గత తిరుగుబాటుతో అట్టుడుకుతున్న ఇరాన్
మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో గత కొద్ది కాలంగా తీవ్ర అస్థిరత నెలకొంది. 2025 డిసెంబర్ 28న ఆర్థిక సంక్షోభం కారణంగా మొదలైన నిరసనలు ఇప్పుడు పెను విప్లవంగా మారాయి. ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ పతనం కావడం, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన వ్యాపారాలు, సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తొలుత ఆర్థిక డిమాండ్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. క్రమంగా రాజకీయ నిరసనగా రూపాంతరం చెందింది. 1979 విప్లవం తర్వాత ఇరాన్ పాలకులకు ఎదురైన అతిపెద్ద సవాలు ఇదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అణచివేతపై ప్రపంచ దేశాల ఆగ్రహం
నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జనవరి 8, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేసి కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ విధించింది. ప్రభుత్వ భద్రతా బలగాల అకృత్యాలను ప్రపంచానికి తెలియకుండా చేసేందుకే ఇరాన్ ఈ చర్యలకు పాల్పడిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. నిరసనకారులపై హింసను అమెరికా తీవ్రంగా ఖండించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఇరాన్ అధికారులపై వీసా నిషేధాలను కూడా వాషింగ్టన్ విధించింది. అయితే తమ దేశంలో జరుగుతున్న అస్థిరత వెనుక అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాల కుట్ర ఉందని ఇరాన్ తిప్పికొడుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
