Let's talk: editor@tmv.in
కొలత్తూరు నుంచి స్టాలిన్‌.. పెరంబూర్ నుంచి విజయ్‌ నామినేషన్ దాఖలు
కొలత్తూరు నుంచి స్టాలిన్‌.. పెరంబూర్ నుంచి విజయ్‌ నామినేషన్ దాఖలు

కొలత్తూరు నుంచి స్టాలిన్‌.. పెరంబూర్ నుంచి విజయ్‌ నామినేషన్ దాఖలు

Pinjari Chand
31 మార్చి, 2026

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ సోమవారం చెన్నైలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం స్టాలిన్ ప్రజలు తనకు వరుసగా నాలుగోసారి ఘన విజయం అందిస్తారని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన రోడ్‌షో నిర్వహించి ప్రజలకు అభివాదం చేస్తూ మద్దతు కోరారు. అలాగే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. మానవ వనరులు, దేవాదాయ శాఖ మంత్రి పీ.కే. శేఖర్ బాబు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలతో కలిసి స్టాలిన్ ఎన్నికల కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. డీఎంకే ఇప్పటికే 164 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం స్టాలిన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి అభివృద్ధి లక్ష్యాలను వెల్లడించారు.

ఈ నియోజకవర్గంలో స్టాలిన్‌కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం తరఫున చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్ పి. శాంతనకృష్ణన్ పోటీ చేస్తున్నారు. అలాగే నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీ తరఫున వి.ఎస్. బాబు పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.

నియోజకవర్గ అభివృద్ధి ఏకరువు

స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల ఆయన ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి. అక్కడ ప్రారంభించిన రూ.4.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘ముధల్వర్ పడైప్పగం’ ప్రాజెక్టు ఒక ప్రత్యేక ప్రభుత్వ సహకార కేంద్రంగా నిలిచింది. ఇది యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కో-వర్కింగ్, లెర్నింగ్ హబ్‌గా పనిచేస్తోంది. అదేవిధంగా పెరియార్ నగర్, జవహర్ నగర్ ప్రాంతాల్లో రూ.4.75 కోట్లతో ఆధునిక లైబ్రరీ-కమ్ కో-వర్కింగ్ స్పేస్‌లు ఏర్పాటు చేశారు. పేపర్ మిల్స్ రోడ్‌లో రూ.19.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక మార్కెట్ కాంప్లెక్స్‌లో 74 వ్యాపార దుకాణాలు, లిఫ్టులు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు.

మురుగు పంపింగ్ స్టేషన్లకు ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ, జవహర్ నగర్‌లో మహిళల జిమ్, గౌతమపురంలో 840 గృహాలు నిర్మించడం వంటి పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. డీఎంకే ఈ ఎన్నికల్లో 200కిపైగా స్థానాలు గెలుస్తుందని స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

పెరంబూర్ నుంచి బరిలో విజయ్

ఇక విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కూడా సోమవారం చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి చెందిన ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విజయ్, రాష్ట్రంలో మహిళల భద్రత లేదని, చట్టవ్యవస్థ బలహీనపడిందని ఆరోపించారు. విజయ్‌కు 2026 అసెంబ్లీ ఎన్నికలు తొలి ఎన్నికలు. ఆయన ఉత్తర చెన్నైలోని పెరంబూర్ నుంచి, సెంట్రల్‌ తమిళనాడులోని తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ చెప్పారు. మీ కోసం నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను, మిమ్మల్ని మోసం చేయనని తెలిపారు. ఈ ఎన్నికలు అధికార డీఎంకే, తన పార్టీ మధ్యే ప్రధాన పోటీగా ఉంటాయని ఆయన అన్నారు. ఇక టీవీకే కీలక నేత ఆధవ్ అర్జునా కూడా చెన్నై ఉత్తర భాగంలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు కూడా ఇదే తొలి అసెంబ్లీ ఎన్నిక.

విజయ్ ఆస్తులు రూ.603 కోట్లు

నటుడు–రాజకీయ నాయకుడు టీవీకే అధినేత విజయ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.404.58 కోట్ల చరాస్తులు, రూ.198.62 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల్లో కోడైకెనాల్‌లో వ్యవసాయ భూములు, చెన్నైలో వాణిజ్య, నివాస భవనాలు ఉన్నాయి. విజయ్ భార్య సంగీత ఆస్తులు మొత్తం రూ.15.76 కోట్లుగా వెల్లడయ్యాయి. ఇందులో రూ.15.51 కోట్ల చరాస్తులు, రూ.25 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి.

విజయ్ వద్ద రూ.2 లక్షల నగదు, రూ.213 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్న వాహనాల్లో బీఎండబ్ల్యూ 530, లెక్సస్‌, టయోట, బీఎండబ్ల్యూ ఐ7 ఉన్నాయి. బంగారం, వెండి ఆభరణాలు కలిపి 883 గ్రాములు (సుమారు రూ.15 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు, ఇతరులకు ఆయన ఇచ్చిన రుణాల్లో టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్‌కు రూ.3 కోట్లు, తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ.3.02 కోట్లు, తల్లి శోభా శేఖర్‌కు రూ.8.71 లక్షలు, భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్‌కు రూ.8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ.4.60 లక్షలు ఉన్నాయి. అలాగే ఏ.ఎల్.పీ. ఆంటోనియస్ బ్రిట్టో, కొకిలాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లకు తలా రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్ ట్రస్ట్‌కు రూ.5.84 కోట్లు రుణంగా ఇచ్చినట్లు తెలిపారు.

తన ప్రధాన ఆదాయ వనరులు స్వయం ఉపాధి, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం అని పేర్కొన్న విజయ్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, బ్యాంకులకు బకాయిలు కూడా లేవని అఫిడవిట్‌లో వెల్లడించారు.