Let's talk: editor@tmv.in
కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం!

కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం!

Shaik Mohammad Shaffee
25 మార్చి, 2026

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 128 మంది ప్రయాణికులతో వెళ్తున్న సైనిక రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 66 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశ సరిహద్దు ప్రాంతమైన పుటుమాయో ప్రావిన్స్‌లోని ప్యూర్టో లెగుయిజామో వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో అత్యధికులు సైనికులేనని కొలంబియా సాయుధ దళాల అధిపతి జనరల్ హ్యూగో అలెజాండ్రో లోపెజ్ బారెట్టో అధికారికంగా వెల్లడించారు.

టేకాఫ్ అయిన 2 కిలోమీటర్లకే..

వాయుసేన కమాండర్ కార్లోస్ ఫెర్నాండో సిల్వా తెలిపిన వివరాల ప్రకారం.. విమానం విమానాశ్రయం నుండి గాలిలోకి ఎగిరిన రెండు కిలోమీటర్ల దూరంలోనే సాంకేతిక సమస్య తలెత్తి కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 115 మంది ఆర్మీ జవాన్లు, 11 మంది సిబ్బంది, ఇద్దరు నేషనల్ పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దట్టమైన పొగలు కమ్ముకున్న ప్రదేశం నుండి క్షతగాత్రులను మోటార్ సైకిళ్లపై ఆసుపత్రులకు తరలించారు. మొత్తం 57 మందిని సురక్షితంగా ఖాళీ చేయించగా, మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

రంగంలోకి వైమానిక అంబులెన్సులు

ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాజధాని బొగెటాకు తరలించేందుకు 74 పడకల సౌకర్యం ఉన్న రెండు ప్రత్యేక విమానాలను ప్యూర్టో లెగుయిజామోకు పంపారు. స్థానిక డిప్యూటీ మేయర్ కార్లోస్ మాట్లాడుతూ, క్షతగాత్రులకు ముందుగా స్థానిక క్లినిక్‌లలో ప్రాథమిక చికిత్స అందించి, ఆపై పెద్ద నగరాలకు తరలించినట్లు పేర్కొన్నారు. సహాయం చేసిన స్థానిక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఉగ్రదాడి కాదు: రక్షణ మంత్రి

ఈ ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, విమానం కూలిపోవడానికి ఎలాంటి ఉగ్రదాడి కారణం కాదని రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు. విమానం కూలిపోవడం దేశానికి తీరని లోటని, మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. కాగా ప్రమాదానికి గురైన హెర్క్యులస్ సీ-130 విమానాన్ని 2020లో అమెరికా కొలంబియాకు విరాళంగా ఇచ్చింది. మూడేళ్ల క్రితమే దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతులు (ఓవర్ హాల్) చేసి ఇంజన్లను మార్చినట్లు విమానయాన నిపుణులు చెబుతున్నారు. నాలుగు ప్రొపెల్లర్లు కలిగిన ఈ విమానంలో హఠాత్తుగా ఇంజన్ వైఫల్యం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది.

ప్రభుత్వంపై విమర్శలు

ఈ దుర్ఘటన దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సైనిక విమానాల ఆధునీకరణకు బ్యూరోక్రసీ అడ్డంకులు సృష్టిస్తోందని అధ్యక్షుడు పెట్రో మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను తొలగిస్తామని హెచ్చరించారు. అయితే పెట్రో ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌లో కోతలు విధించడం వల్లే విమానాల నిర్వహణ సరిగా లేదని, పైలట్లకు తగినన్ని ఫ్లయింగ్ అవర్స్ లభించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.