Let's talk: editor@tmv.in
కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ‌

కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ‌

Gaddamidi Naveen
18 నవంబర్, 2025

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణం, జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ‌ ఆదేశించారు. ఈ మేరకు, సచివాలయం నుంచి సిద్దిపేట జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జాతర ఏర్పాట్లపై విస్తృతంగా సమీక్ష జరిపారు.

సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలు, అమలు చర్యలు, భక్తులకు అందించాల్సిన సౌకర్యాలపై చర్చ జరిగింది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాకపోకలు సాఫీగా జరిగేలా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు మంత్రి సూచించారు. భక్తుల భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని అదనపు పోలీసు సిబ్బంది నియామకం, సీసీటీవీ ‌పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.అదేవిధంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, శౌచాలయాలు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, పార్కింగ్ స్థలాలు వంటి ప్రజా అవసరాల ఏర్పాట్లను సమగ్రంగా సమన్వయం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తేనే జాతర విజయవంతం అవుతుందని అధికారులకు మంత్రి గుర్తుచేశారు.

రాబోయే మల్లన్న కళ్యాణం, సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన సౌకర్య‌లు జాతరను రాష్ట్ర ప్రతిష్ఠకు తగ్గట్టుగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవాల పోస్టర్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, శ్రీ మల్లికార్జున స్వామి వారి (కొమురవెల్లి మల్లన్న) వార్షిక కల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు/పోస్టర్లను మంత్రి కొండా సురేఖ,ఉన్నతాధికారులు విడుదల చేశారు.స్వామివారి కల్యాణ మహోత్సవం డిసెంబర్ 29, 2024, ఉదయం 10:45 గంటలకు నిర్వహించబడనుందని తెలిపారు.'పెద్ద పట్నం', 'అగ్నిగుండం' వంటి ముఖ్యమైన పూజా కార్యక్రమాల జరుగుతాయి.జాతర సాధారణంగా మాఘమాసంలో ప్రారంభమై, మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది.