
కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ 'జై ఆదివాసీ' నినాదాలతో హోరెత్తింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆదివాసుల చరిత్ర అనేది తమ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటాల చరిత్ర అని కొనియాడారు. సమ్మక్క-సారక్క, బిర్సా ముండా, రాంజీ గోండు, కొమరం భీమ్‌ల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించిందని, వాటిని సమర్థంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని సీతక్క స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడటం ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని, అందరితో సోదరభావంతో కలిసి రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాలు, అడవిపై హక్కుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ వారి అస్తిత్వానికి ప్రతీకలని, వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. కొమరం భీమ్ స్ఫూర్తితో అభివృద్ధి, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం సీతక్క మహిళా సమాఖ్య భవనాన్ని సందర్శించి, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
