Let's talk: editor@tmv.in
కొబ్బరి రైతులకు ఊరట..రూ.20.77 కోట్లతో శంకరగుప్తం డ్రెయిన్ పనులు ప్రారంభం

కొబ్బరి రైతులకు ఊరట..రూ.20.77 కోట్లతో శంకరగుప్తం డ్రెయిన్ పనులు ప్రారంభం

Panthagani Anusha
31 డిసెంబర్, 2025

అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా కొబ్బరి రైతులను వేధిస్తున్న శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆధునికీకరణ పనులకు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

గత నెల 26న రాజోలు నియోజకవర్గంలోని కేశవదాసుపాలెం పర్యటనలో సముద్రపు ఉప్పునీటి పోటుతో వేలాది ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమవుతున్న తీరును చూసి చలించిన పవన్ కళ్యాణ్, 45 రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ గడువు కంటే ముందే కేవలం 35 రోజుల్లోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం విశేషం.

రూ. 20.62 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ 8.50 కిలోమీటర్ల నుండి 16.50 కిలోమీటర్ల వరకు పూర్తిస్థాయిలో పూడికతీత పనులు నిర్వహించనున్నారు. అదేవిధంగా డ్రెయిన్ ప్రారంభం నుండి 14.50 కిలోమీటర్ల వరకు ఇరువైపులా గట్లను పటిష్టపరచనున్నారు. దీనివల్ల వందలాది మంది కొబ్బరి రైతులకు ఉప్పునీటి ముప్పు తప్పి, తోటలకు పునరుజ్జీవం లభిస్తుంది. డ్రెయిన్ ఆధునికీకరణతో పాటు, సుమారు 250 ఎకరాల డ్రెయిన్ భూమి ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిదంగా గతంలో కౌలు రైతుల కష్టాలను చూసి తన సొంత సంపాదన రూ.5 కోట్లతో 'కౌలు రైతు భరోసా యాత్ర' ప్రారంభించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో నేడు ప్రభుత్వంలో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని డ్రెయిన్ల వ్యవస్థ మెరుగుదల కోసం నిపుణుల కమిటీ (బి.సి. రోశయ్య రిపోర్టు) నివేదికను అధ్యయనం చేస్తున్నామని, సుమారు రూ. 4 వేల కోట్లతో భవిష్యత్తులో మరిన్ని ఆధునికీకరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కోనసీమలో 'కోకోనట్ బోర్డు' ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్‌గా పాల్గొనగా, రాజోలు నుంచి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరి రైతులకు ఊరట..రూ.20.77 కోట్లతో శంకరగుప్తం డ్రెయిన్ పనులు ప్రారంభం - Tholi Paluku