
కొన్ని శక్తులు విద్యారంగంలో మూఢనమ్మకాలను జోడిస్తున్నాయి: పినరయి విజయన్
కొన్ని మత శక్తులు విద్యా రంగంలో అంధ విశ్వాసాలు, అవాస్తవ భావనలను ప్రోత్సహిస్తూ పిల్లలను శతాబ్దాల పాటు వెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని, అయితే కేరళ మాత్రం తర్కబద్ధమైన ప్రజా విద్యను బలోపేతం చేయడానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. బుధవారం వర్కలలోని శివగిరి మఠంలో నిర్వహించిన 93వ శివగిరి తీర్థయాత్ర కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, శ్రీ నారాయణ గురువుల తత్వశాస్త్రం నేటి సమాజానికి ఎంతగానో అవసరమని తెలిపారు. విద్యా పాఠ్యాంశాల్లో అంధ విశ్వాసాలు, మిథ్యా భావనలను చేర్చే ప్రయత్నాలు.. నారాయణ గురువు పోరాడిన తర్కబద్ధమైన విద్యా సిద్ధాంతానికి అవమానమని అన్నారు.
ఎక్కడో అధికారంలో ఉన్న కొందరు అంధ విశ్వాసాలు, అపోహలను విద్యలోకి తీసుకువచ్చి పిల్లలను శతాబ్దాలపాటు వెనక్కి నెట్టాలని చూస్తున్నారు. కానీ కేరళలో మేము ప్రజా విద్యను బలోపేతం చేయడానికే అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నాం. నారాయణ గురువు వ్యతిరేకించిన మూఢనమ్మకాలను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నాలు ఆయన తత్వానికి ప్రత్యక్ష అవమానమని విజయన్ వ్యాఖ్యానించారు.
కుల వ్యవస్థపై విమర్శలు
కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన ముఖ్యమంత్రి, కులం ఒక సామాజిక నిర్మాణం మాత్రమే కాకుండా, అణచివేతకు ఉపయోగించిన ఒక సాధనంగా కూడా పనిచేసిందన్నారు. ఉత్పత్తి సంబంధాలు, వృత్తులు, జీతాలు, హక్కులు, బాధ్యతలన్నింటినీ కులం నియంత్రించిందని వివరించారు. ఒకప్పుడు కులమే చట్టంలా పనిచేసింది. ప్రతి కులానికి వేర్వేరు చట్టాలు ఉండేవి. ఉన్నత కులానికి చెందిన వ్యక్తి, దిగువ కులానికి చెందిన వ్యక్తిని హత్య చేసినా శిక్ష ఉండేది కాదు. కానీ దీనికి విరుద్ధంగా జరిగితే తీవ్రమైన శిక్షలు, మరణదండన కూడా విధించేవారు. అంటే కుల వ్యవస్థే రాజ్యంలా, అణచివేత యంత్రాంగంలా పనిచేసిందని ఆయన వివరించారు.
నేటి కాలంలోనూ నాటి చాతుర్వర్ణ వ్యవస్థను ఆధునిక చట్ట వ్యవస్థ రూపంలో తిరిగి తీసుకురావడానికి రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని విజయన్ హెచ్చరించారు. ఈ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాకూడదు. కుల, మత భేదాలకు వ్యతిరేకంగా నిలిచిన శ్రీ నారాయణ గురువు జీవన సందేశం, ఇలాంటి ధోరణులను ప్రతిఘటించే బాధ్యతను ప్రతి పౌరుడిపై ఉంచుతోందని ఆయన అన్నారు.
బ్రహ్మణవాదాన్ని ప్రశ్నించడమే విముక్తికి తొలి అడుగు
ట్రావెన్ కోర్ రాజ్య పాలన కాలంలో సామాజిక పరిస్థితులను గుర్తు చేస్తూ, అధికారమంతా కొద్ది మంది చేతుల్లోనే ఉండేదని, సమాజంలోని పేద వర్గాలు అవమానం, బానిసత్వంలో జీవించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రాహ్మణవాదాన్ని ప్రశ్నించడమే విముక్తికి తొలి అడుగు. అది కుల వ్యవస్థ అనే నైతిక పునాదినే కూల్చడమే అని ఆయన స్పష్టం చేశారు. శివగిరి తీర్థయాత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ యాత్ర కేరళ సామాజిక–సాంస్కృతిక జీవితానికి నిరంతర ప్రేరణగా నిలిచిందన్నారు. శివగిరి తీర్థయాత్రకు 93 సంవత్సరాలు పూర్తవుతున్నాయని, మరో మూడు సంవత్సరాల్లో శ్రీ నారాయణ గురువుల సమాధి శతాబ్దోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు.
