
కొత్త యూజీసీ నిబంధనలతో వివక్ష ఉండదు: కేంద్రమంత్రి
కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల్లో ఎలాంటి దుర్వినియోగానికి అవకాశం లేదని, వాటి అమలులో వివక్ష జరగదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టాన్ని ఎవరూ దుర్వినియోగం చేయలేరు. అమలులో ఎలాంటి వివక్ష ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
జనవరి 13న యూజీసీ విడుదల చేసిన కొత్త నిబంధనలపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 2012 నిబంధనలకు సవరణగా తీసుకొచ్చిన ఈ కొత్త నియమాలు, కళాశాలలు–విశ్వవిద్యాలయాల్లో కుల ఆధారిత వివక్షను అరికట్టడం లక్ష్యంగా రూపొందించినవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరిగా మారింది. అయితే, సాధారణ వర్గ(జనరల్ కేటగిరి) విద్యార్థులపై ఇవి వివక్షకు దారితీయవచ్చని కొందరు విద్యార్థులు, సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై లక్నో యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు నిరసనకు దిగారు. యూజీసీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ జిల్లా సలోన్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ త్రిపాఠి, కొత్త యూజీసీ నిబంధనలపై అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో, ఈ నిబంధనలను సమాజాన్ని విభజించే ప్రమాదకర చట్టంగా ఆయన అభివర్ణించారు.
ఇదిలా ఉండగా, సస్పెండ్ అయిన బరేలీ సిటీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి, ఉత్తరప్రదేశ్‌లో సాంవిధానిక వ్యవస్థ విఫలమైందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల నుంచి తనకు మద్దతు లభిస్తోందని ఆయన తెలిపారు. వివక్షను ఆపేందుకు తెచ్చిన నిబంధనలు, కొత్త వివక్షకు దారితీయవచ్చన్న భయమే ఈ గొడవకు ప్రధాన కారణంగా నిలిచాయి.
నా మీద కుట్ర జరిగింది: బరేలీ సిటీ మేజిస్ట్రేట్
ప్రభుత్వ విధానాలకు, ముఖ్యంగా కొత్త యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజీనామా చేసి అనంతరం సస్పెండ్‌కు గురైన బరేలీ సిటీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి, తనపై పూర్వ ప్రణాళికతో కూడిన కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మంగళవారం ఆయన బరేలీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అలంకార్ అగ్నిహోత్రి సస్పెన్షన్‌తో రాష్ట్రంలో పెద్ద పరిపాలనా, రాజకీయ వివాదం చెలరేగింది. ఆయనను శామ్లీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
నిరసనకు దిగిన అగ్నిహోత్రి
2019 బ్యాచ్‌కు చెందిన ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (పీసీఎస్) అధికారి అయిన అగ్నిహోత్రి, ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త నిబంధనలపై తీవ్ర విభేదాలు ఉన్నాయని పేర్కొంటూ సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. మంగళవారం ఆయన తన నిరసనను మరింత ఉధృతం చేస్తూ, మద్దతుదారులతో కలిసి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నన్ను నిర్బంధించేందుకు ప్రయత్నించారు
తన అధికార నివాసం వద్ద పోలీసులు మోహరించినప్పటికీ, అక్కడి నుంచి బయటకు వచ్చి కలెక్టరేట్‌కు చేరుకున్నామని, సోమవారం రాత్రి తనను నిర్బంధించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టును, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని అగ్నిహోత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర మేజిస్ట్రేట్ అధికార నివాసంలోని ఏడీఎం కంపౌండ్ ప్రధాన గేటును పోలీసులు మూసివేశారు.
సస్పెన్షన్, శాఖాపర విచారణ
ప్రత్యేక కార్యదర్శి అన్నపూర్ణ గార్గ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అలంకార్ అగ్నిహోత్రి క్రమశిక్షణ ఉల్లంఘనకు ప్రాథమికంగా బాధ్యుడని తేలడంతో తక్షణమే సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపర విచారణకు ఆదేశాలు జారీ చేయగా, బరేలీ డివిజనల్ కమిషనర్ బీ.ఎస్. చౌదరీ విచారణాధికారిగా వ్యవహరించనున్నారు. ఈ విచారణ సమయంలో అగ్నిహోత్రి శామ్లీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అటాచ్‌గా కొనసాగనున్నారు. ప్రత్యేకంగా ఛార్జ్‌షీట్ కూడా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
యూజీసీ నిబంధనలపై తీవ్ర వ్యాఖ్యలు
తన రాజీనామా ప్రకటనలో అగ్నిహోత్రి కొత్త యూజీసీ నిబంధనలను ‘బ్లాక్ లా’గా అభివర్ణించారు. ఇవి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ఉద్రిక్తతలకు దారితీయవచ్చని, విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆరోపించారు. ఈ నిబంధనలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. జనవరి 13న జారీ చేసిన యూజీసీ నిబంధనల ప్రకారం, ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలు, హెల్ప్‌లైన్లు, మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారిస్తాయి.
కేంద్రంపై తీవ్ర ఆరోపణలు
తన రాజీనామా ప్రకటనలో అగ్నిహోత్రి కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రాహ్మణ సమాజానికి అవమానం జరుగుతోందని, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తాజా మఘ్‌మేళాకు సంబంధించిన ఘటనను ప్రస్తావిస్తూ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి సమాజానికి మద్దతుగా నిలవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
