Let's talk: editor@tmv.in
కొత్త పార్టీ పేరు ప్రకటించిన శశికళ

కొత్త పార్టీ పేరు ప్రకటించిన శశికళ

Dantu Vijaya Lakshmi Prasanna
14 మార్చి, 2026

బహిష్కృత ఏఐఏడీఎంకే నాయకురాలు వి.కె. శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీకి “ ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరు పెట్టినట్లు ఆమె శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కొన్ని వారాల క్రితం పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన శశికళ, ఇప్పుడు పార్టీ నిర్మాణం, సిద్ధాంతాలు, ఎన్నికల వ్యూహంపై స్పష్టత ఇచ్చారు.

ఫిబ్రవరి 24న, దివంగత ఏఐఏడీఎంకే అధినేత్రి జె. జయలలిత 74వ జయంతి సందర్భంగా, రామనాథపురం జిల్లా కముతిలో పార్టీ జెండాను శశికళ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం ద్వారా పార్టీ ఉనికిని అధికారికంగా ప్రజల ముందు ఉంచారు. అనంతరం పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్ల సమూహాన్ని” ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ గుర్తు తమ పార్టీ లక్ష్యమైన ఐక్యతను సూచిస్తుందని ఆమె తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ శశికళ మాట్లాడుతూ, కొబ్బరి చెట్టు గుర్తు వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. “మా పార్టీ గుర్తు చూశారా? అది కొబ్బరి చెట్లు,. మేము దాన్ని సమూహ తోటగా భావిస్తాం,” అని చెప్పారు. తమిళ సామెతను ప్రస్తావిస్తూ, “ఒక చెట్టు తోటను తయారు చేయదు, మేము ఒంటరిగా రాలేదు, తోటగా వచ్చాము. ఆ తోటలో మా పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రజలు ఉన్నారు,” అని వ్యాఖ్యానించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎలా పోటీ చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా, కూటమి ఏర్పాటుచేసి ఎన్నికల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. “మేము సమాన అభిప్రాయాలు, సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తాం. కొందరు ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తారు. కానీ మేము ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం,” అని తెలిపారు.

తమ రాజకీయ ప్రయాణం ఇకపై విజయయాత్ర అవుతుందని శశికళ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే తుది నిర్ణేతలని పేర్కొంటూ, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి నిర్మాణం, కూటమి చర్చలపై త్వరలో మరింత స్పష్టత ఇస్తామని ఆమె సూచించారు.

కాగా, శశికళ తన కొత్త రాజకీయ పార్టీ జెండాను తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో రూపొందించి, అందులో దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ గుర్తులను పొందుపరిచారు. త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడులో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. చిన్నమ్మగా జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్న శశికళ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, అనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినప్పటికీ, చెన్నై వేదికగా మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీల పాత్ర పోషించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఆమె అనుచరులు కూడా ఆమె నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటామని ప్రకటించడంతో తమిళనాట రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఫిలిం స్టార్ విజయ్ రాజకీయ పార్టీతో రాష్ట్రంలో ప్రచారం కొనసాగుతుండగా, శశికళ ప్రవేశంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.