
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధర రూ.5.59 లక్షల నుంచి ప్రారంభం
టాటా మోటార్స్ తన పాపులర్ కారు 'టాటా పంచ్'లో సరికొత్త మోడల్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త వెర్షన్‌లో అదిరిపోయే ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్లను కంపెనీ జత చేసింది.
ఇంజిన్, గేర్ బాక్స్ ప్రత్యేకతలు
ఈ కొత్త పంచ్ కారులో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వేగంగా వెళ్లాలనుకునే వారి కోసం టర్బో పెట్రోల్ ఇంజిన్, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం సీఎన్‌జీ వెర్షన్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సీఎన్‌జీ మోడల్‌లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ సౌకర్యాన్ని టాటా తీసుకొచ్చింది. ఇలాంటి సదుపాయం ఒక ఎస్‌యూవీలో రావడం ఇదే మొదటిసారి.
భద్రతలో నంబర్ వన్ (5 స్టార్ రేటింగ్)
ప్రయాణికుల రక్షణ విషయంలో ఈ కారు రాజీ పడలేదు. దీనికి భారత్ ఎన్‌క్యాప్ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ లభించింది. అంటే ఇది అత్యంత సురక్షితమైన కారు. ఇందులో అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు, బ్రేకింగ్ కంట్రోల్ సిస్టమ్స్, కొండ ప్రాంతాల్లో కారు వెనక్కి జారకుండా ఉండే 'హిల్ హోల్డ్' వంటి ఫీచర్లు ఉన్నాయి.
హైటెక్ ఫీచర్లు
కారు లోపల చూడటానికి చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో పెద్ద టచ్ స్క్రీన్, కారు చుట్టూ కనిపెట్టేలా 360 డిగ్రీల కెమెరా, సెల్‌ఫోన్ వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. వర్షం పడితే వాటంతట అవే పనిచేసే వైపర్లు, రాత్రిపూట కంటికి వెలుతురు ఇబ్బంది లేకుండా ఉండే రియర్ వ్యూ మిర్రర్ వంటి ఆధునిక వసతులు కల్పించారు.
ఈ కారు విడుదల సందర్భంగా టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, “పంచ్ ఎస్‌యూవీ భారత వినియోగదారుల ఆశయాలకు ప్రతిబింబం. కొత్త మోడల్ మరింత వేగంగా, స్మార్ట్‌గా, సురక్షితంగా రూపొందించాం” అని అన్నారు. ఇప్పటికే సుమారు 7 లక్షల మంది వినియోగదారుల నమ్మకం పొందిన పంచ్, ఈ కొత్త వెర్షన్‌తో మరింత ప్రజాదరణ పొందుతుందని కంపెనీ ఆశిస్తోంది.
