
కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందాలి: సీఎం
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వేగం (స్పీడ్ ఆఫ్ డెలివరీ) అన్ని విభాగాల్లోనూ స్పష్టంగా కనిపించాలంటే ప్రజలకు సేవలందించడంలో ఎక్కడా జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 800 రకాల పౌర సేవలను వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తోందని వీటి నాణ్యతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ యంత్రాంగం సరికొత్త ఉత్సాహంతో పని చేసి, సామాన్యులకు అత్యుత్తమ సేవలను చేరువ చేయాలని ఆకాంక్షించారు. గత కొద్దికాలంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, చేయూత వల్ల రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి అని ఇదే స్ఫూర్తితో అన్నదాతలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాల్లో కనీసం 50 శాతం మేర రీసైక్లింగ్ ప్రక్రియ జరగాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం స్వచ్ఛ రథాలను వినియోగించుకోవాలని తడి చెత్త నుంచి కంపోస్టు తయారీకి పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించేలా పక్కా రవాణా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని, పారిశుద్ధ్య నిర్వహణను ఒక వ్యవస్థీకృత పద్ధతిలో చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల రూపురేఖలను మార్చడంతో పాటు వాటి పేరును కూడా మార్చాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని స్వర్ణ గ్రామంగా పిలవనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను చేరుకోవడంలో సచివాలయాలను ప్రధాన కేంద్రాలుగా (విజన్ యూనిట్లుగా) తీర్చిదిద్దాలని ఈ మార్పు ద్వారా క్షేత్రస్థాయి పాలనలో సరికొత్త విప్లవం తీసుకురావాలని ప్రభుత్వం భవిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు బ్యాండ్ విడ్త్ విస్తరణపై దృష్టి సారించాలన్నారు. పథకాల అమలులో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఐవీఆర్ఎస్ , క్యూఆర్ కోడ్ వంటి వినూత్న పద్ధతులను వినియోగించాలని సూచించారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ 2026 క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మంత్రులు, సిఎస్ విజయానంద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
