Let's talk: editor@tmv.in
కొత్త ఏడాదిలో ఇస్రో తొలి అడుగు: పిఎస్ఎల్వీ -సి 62 ప్రయోగానికి సర్వం సిద్ధం

కొత్త ఏడాదిలో ఇస్రో తొలి అడుగు: పిఎస్ఎల్వీ -సి 62 ప్రయోగానికి సర్వం సిద్ధం

Dantu Vijaya Lakshmi Prasanna
8 జనవరి, 2026

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన పిఎస్ఎల్వీ - సి62 మిషన్‌ను జనవరి 12 (సోమవారం) ఉదయం 10 గంటల,17నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించనుంది.

ఎక్స్ వేదికగా ఇస్రో అధికారులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, " పిఎస్ఎల్వీ - సి 62 మిషన్ ప్రయోగం 12 జనవరి 2026న ఉదయం 10:17 గంటలకు షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి షెడ్యూల్ చేయబడింది" అని పేర్కొన్నారు.

పిఎస్ఎల్వీ - సి 62 మిషన్‌ ప్రత్యేకతలు:

పిఎస్ఎల్వీ ఇస్రో అత్యంత విశ్వసనీయమైన, 'వర్క్‌హోర్స్' గా పేరుగాంచిన రాకెట్. సాధారణంగా పిఎస్ఎల్వీ నాలుగు దశల రాకెట్. ఇందులో ఘన, ద్రవ ఇంధన దశలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించబడుతుంది.

పిఎస్ఎల్వీ - సి62 అనేది ప్రధానంగా భూపరిశీలన లేదా వాణిజ్య ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేరవేయడానికి ఉద్దేశించబడింది. సాధారణంగా ఇవి సూర్య సమన్వయ ధ్రువ కక్ష్యలలో ఉపగ్రహాలను ప్రవేశపెడతాయి.

ఈ మిషన్ ద్వారా ప్రయోగించే ఉపగ్రహాలు రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ లేదా వైజ్ఞానిక పరిశోధనలకు సంబంధించినవి అయి ఉంటాయి. (నిర్దిష్ట ఉపగ్రహం పేరు ఎక్స్ పోస్ట్‌లో ఇంకా పూర్తిగా వెల్లడించనప్పటికీ, ఇది సాధారణంగా దేశీయ అవసరాల కోసం లేదా అంతర్జాతీయ కస్టమర్ల కోసం చేసే ప్రయోగం).

గత మిషన్ తో పోలిక:

ఎల్ వి ఎమ్ లాంటి భారీ ఉపగ్రహాలను (4000 కేజీల వరకు) మోసుకెళ్లడానికి వాడతారు. అయితే, ఇప్పుడు ప్రయోగించబోయే పిఎస్ఎల్వీ మీడియం బరువు ఉన్న ఉపగ్రహాలను (1750 కేజీల వరకు) చాలా ఖచ్చితత్వంతో కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ప్రసిద్ధి చెందింది.

ఈ మిషన్ విజయవంతమైతే, 2026 సంవత్సరంలో ఇస్రో సాధించబోయే మొట్టమొదటి భారీ విజయం ఇదే అవుతుంది.

కాగా, ఇటీవల డిసెంబర్ 24న, అమెరికాకు చెందిన 'ఏఎస్టీ స్పేస్ మొబైల్' కోసం ఇస్రో బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ ద్వారా ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చి భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా హై-స్పీడ్ సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించేలా రూపొందించబడింది. ఇది ఎల్వీఎమ్ 3 రాకెట్ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపబడిన అత్యంత భారీ పేలోడ్.

ఎల్వీఎమ్3 సామర్థ్యం:

ఎల్వీఎమ్ 3 -ఎమ్6 మిషన్ అనేది ఒక పూర్తి స్థాయి వాణిజ్య మిషన్. ఇది ఎల్వీఎమ్ 3 రాకెట్‌కు ఆరవ కార్యాచరణ విమానం. భారత గడ్డపై నుండి ప్రయోగించిన అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ శాటిలైట్ కూడా ఇదే. ఇస్రో అభివృద్ధి చేసిన ఎల్వీఎమ్ 3 అనేది మూడు దశల లాంచ్ వెహికల్. ఇది రెండు సాలిడ్ స్ట్రాప్-ఆన్ మోటార్లు (S200). లిక్విడ్ కోర్ స్టేజ్ (L110). క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ (C25) కలిగి ఉంది. దీని మొత్తం బరువు 640 టన్నులు, ఎత్తు 43.5 మీటర్లు. ఇది దాదాపు 4,200 కిలోల బరువును జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి చేరవేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.