
కొత్త ఉపాధి చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే నిరసన పోరు
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నిరద్దు చేస్తూ తీసుకువచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా, తమిళనాడులోని అధికార పక్షం డిఎంకె నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ డిసెంబర్ 24న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ నిరసన డిసెంబర్ 24, ఉదయం 10 గంటలకు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పరిధిలో, 100 రోజుల ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు, జిల్లా కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కూటమి పార్టీల సభ్యులతో మొదలవుతుంది.
ప్రధాన అభ్యంతరాలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 ను తీసుకువచ్చింది. దీనిని ఉపసంహరించుకోవాలని కూటమి డిమాండ్ చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త పథకం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని, గ్రామీణ పేదల జీవనోపాధి దెబ్బతింటుందని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ విమర్శలు
తమిళనాడు ప్రజలను వంచిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, వారికి మద్దతు పలుకుతున్న ఏఐఏడిఎంకె కి వ్యతిరేకంగా గళం ఎత్తాలని కూటమి తన ప్రకటనలో పిలుపునిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాస్తూ, ఈ కొత్త చట్టం అంతర్ ప్రభుత్వ సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో విషయాలు:
ఇది 2005లో చట్టంగా రూపొందించబడింది (అప్పుడు దీనిని ఎన్ఆర్ఇజిఏ అని పిలిచేవారు). 2009లో దీనికి మహాత్మా గాంధీ పేరును చేర్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, గ్రామీణ ప్రజలకు పని పొందేలా కల్పించిన ఒక 'చట్టబద్ధమైన హక్కు'.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి పథకం 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)', ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కంటే భిన్నంగా అనేక మార్పులతో రూపొందించబడింది.
ఈ కొత్త పథకంలోని ప్రధాన అంశాలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద సంవత్సరానికి 100 రోజుల పని గ్యారెంటీ ఉండగా, కొత్త పథకంలో దీనిని 125 రోజులకు పెంచారు. విత్తనాలు వేసే సమయంలో కోత సమయాల్లో వ్యవసాయ పనులకు కూలీల కొరత లేకుండా చూడటానికి, ఈ పథకం కింద పనులను ఏడాదిలో 60 రోజుల పాటు నిలిపివేస్తారు. ఈ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లో అన్-స్కిల్డ్ కూలీల వేతనాలను 100% కేంద్రమే భరించేది. కొత్త పథకంలో ఇది 60:40 నిష్పత్తికి మారింది. అంటే కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు భరించాలి. (ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తి ఉంటుంది). దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.
బడ్జెట్ పరిమితి
పాత పద్ధతిలో పని డిమాండ్ ఉన్నంత వరకు నిధులు ఇచ్చేవారు. కొత్త చట్టం ప్రకారం, కేంద్రం ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ పరిమితిని విధిస్తుంది. కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ భారాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. పనుల పర్యవేక్షణ కోసం బయోమెట్రిక్ హాజరు, డ్రోన్లు, జియో-ట్యాగింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. అవినీతిని అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
కేవలం గుంతలు తీయడం వంటి పనులు కాకుండా,నీటి సంరక్షణ (చెరువులు, కాలువలు), గ్రామీణ మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులను తట్టుకునే శాశ్వత ఆస్తుల కల్పనపై ఈ పథకం దృష్టి పెడుతుంది. పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం మీద, ప్రభుత్వం దీనిని గ్రామీణ అభివృద్ధికి మెరుగైన సంస్కరణగా అభివర్ణిస్తుంటే, విపక్షాలు మాత్రం ఇది పేదల "పని హక్కు"ను బలహీనపరుస్తుందని ఆరోపిస్తున్నాయి.
