Let's talk: editor@tmv.in
కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్ గిరిజనుల హక్కు: ఎంపీ తనూజ రాణి

కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్ గిరిజనుల హక్కు: ఎంపీ తనూజ రాణి

Panthagani Anusha
11 ఏప్రిల్, 2026

కొత్తవలస–కిరండూల్ (కేకే) రైల్వే లైన్ గిరిజనుల హక్కు అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాల్తేరు డివిజన్ నుంచి వేరు చేయకూడదని వైసీపీ నేత,అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజ రాణి స్పష్టం చేశారు. ఈ లైన్‌ను రాయగడ డివిజన్‌లో విలీనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేకే లైన్ పరిధిలోని గిరిజన ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేందుకు తాను అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.

పార్లమెంట్‌లో గళమెత్తాం..

కేకే లైన్ అంశంపై ఇప్పటికే పార్లమెంటులో గళమెత్తానని కేంద్ర రైల్వే మంత్రితో స్వయంగా భేటీ అయి వినతిపత్రం సమర్పించానని ఎంపీ పేర్కొన్నారు. ఈ రైల్వే మార్గానికి దశాబ్దాల కాలంగా చారిత్రక పరిపాలనా ప్రాముఖ్యత ఉంది. ఇది గిరిజన ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. అటువంటి కీలకమైన లైన్‌ను రాయగడ డివిజన్‌కు తరలించడం గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేకే లైన్ వాల్తేరు డివిజన్ పరిధిలో కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

సమిష్టి పోరాటం అవసరం

కాగా ఈ సమస్య కేవలం ఒక పార్టీకి సంబంధించినది కాదని గిరిజనుల మనుగడకు సంబంధించినదని తనూజారాణి పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీలు, నేతలు కూడా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు. "నేను ఇప్పటికే కేంద్రానికి నా విజ్ఞప్తిని పంపాను. ఇప్పుడు తుది నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల చొరవపై ఆధారపడి ఉంటుంది. అందరం కలిసికట్టుగా పోరాడితేనే గిరిజనుల హక్కులను కాపాడుకోగలం అని ఆమె వ్యాఖ్యానించారు.

కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్ గిరిజనుల హక్కు: ఎంపీ తనూజ రాణి - Tholi Paluku