Let's talk: editor@tmv.in
కొడంగల్‌లో కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌లో కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
23 జులై, 2026

తనను రాష్ట్ర స్థాయిలో ఎదగకుండా అడ్డుకోవడంతో పాటు రాజకీయంగా దెబ్బతీసేందుకు కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

కొడంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఓలు), ముఖ్య నాయకుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్, బీజేపీల రాజకీయ ప్రణాళికలకు తాను అడ్డంకిగా మారడమే కాకుండా, వారి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే వారు కొడంగల్‌పై దృష్టి పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పేర్లు వేరైనా వారి లక్ష్యం ఒక్కటే. ఒకరిని అధికారం నుంచి దించి, మరొకరు అధికారంలోకి రాకుండా అడ్డుకున్నది ఒకే వ్యక్తి అనే భావనతో వారిద్దరూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌కు ఓటేసిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి మమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారు. నన్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వెనుక నుంచి దాడి చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు.

ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3వ తేదీతో ముగియనున్నందున, ఓటర్ల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ బీఎల్‌ఏలకు ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 22 శాతం మంది ఓటర్ల నమోదు పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులైన బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదని, కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయించే పూర్తి బాధ్యత బీఎల్‌ఏలపైనే ఉందన్నారు.

ఓటరు జాబితా ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఒకవేళ ఓటరు జాబితాలో పేరు లేకపోతే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రభుత్వ పథకాలేవీ దక్కవు. గ్రామంలో ఓటరుగా పేరు లేకపోవడం అంటే మనిషి జీవించి ఉన్నా చనిపోయినట్లే లెక్క అని సీఎం స్పష్టం చేశారు. జూలై 30 నాటికి నియోజకవర్గంలో 100 శాతం ఓటర్ల నమోదును పూర్తి చేసి, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని బీఎల్‌ఏలను ఆదేశించారు.