
కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ నిర్మాణం
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి, నవంబర్ 14న కొడంగల్‌లో జరగనున్న గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమిపూజ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ నిర్మించబడనుంది. ఈ కిచెన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ వేడి, శుభ్రతతో కూడిన పోషకాహార మధ్యాహ్న భోజనం అందించనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి రూ.7 చొప్పున ఖర్చు చేస్తుండగా, అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.25 వరకు వెచ్చిస్తోంది. అదనపు వ్యయాన్ని ఫౌండేషన్ స్వయంగా భరించడమే కాకుండా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల సాయంతో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
గత ఏడాది డిసెంబర్ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 312 పాఠశాలల్లో సుమారు 28 వేల మంది విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం వేళ తినుబండారాలు పొందుతున్నారు. ఈ పథకానికి పిల్లలు, తల్లిదండ్రుల నుంచి విస్తృతంగా స్పందన లభించింది.
అల్పాహారం పథకం విజయవంతం కావడంతో, మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ చేపట్టడం కొడంగల్ విద్యార్థుల ఆరోగ్యానికి, విద్యా ప్రగతికి తోడ్పడనుంది. ఈ కార్యక్రమం దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశముందని పేర్కొన్నారు.
