Let's talk: editor@tmv.in
కొండాపూర్ పారిశ్రామిక పార్కు ప్రారంభానికి సిద్ధం: మంత్రి శ్రీధర్ బాబు

కొండాపూర్ పారిశ్రామిక పార్కు ప్రారంభానికి సిద్ధం: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
5 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేసిన పరిశ్రమల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ పార్క్‌లో ప్రతిపాదించిన 64 పరిశ్రమల యూనిట్లలో తొలి దశలో 36 యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని తెలిపారు. వీటి ద్వారా దాదాపు 5,000 మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.

సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమలు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జాతీయ రహదారి (ఎన్‌హెచ్)కు అనుసంధానించే అప్రోచ్ రోడ్డును వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే, పరిశ్రమల కార్యకలాపాలకు అవసరమైన మిగిలిన మౌలిక వసతుల పనులను నిర్ధేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వాస్తవంగా ఉత్పత్తి, ఉపాధి స్థిరమైన పారిశ్రామిక వృద్ధిగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజాకేంద్రీకృత పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టిస్తూ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు.

కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమలు ప్రారంభమైతే మెదక్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆర్థిక చలనం పెరగనుందని, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు కూడా లాభం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.