
కొండాపూర్‌లో 700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో పార్కులు, ప్రజావసరాల పేరుతో కేటాయించిన విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. బడాబాబుల దూకుడుతో దశాబ్దాలుగా స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న అక్రమ లావాదేవీలపై స్పందించిన హైడ్రా, దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కులుగా గుర్తించిన ప్రాంతాల్లో హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.
హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికి రూ. 200 కోట్ల వరకు ధర పలుకుతున్న నేపథ్యంలో,హైడ్రా కాపాడిన భూమి మొత్తం విలువ 700 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కొండాపూర్ గ్రామ పరిధిలో 1980 దశకంలో ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర హెచ్‌ఏఎల్ కాలనీ మొత్తం 57.20 ఎకరాల్లో 627 ప్లాట్లను కలిగి ఉందని. ఆ కాలంలో 1.20 ఎకరాల చొప్పున రెండు పార్కులు, మరో 2 ఎకరాల పార్కు, 1000 గజాల ప్రజావసరాల స్థలం కేటాయించారు. కానీ ఇవన్నీ కాలక్రమేణా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.
హైడ్రాకు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా, పార్కులను అక్రమంగా ప్లాట్లుగా మార్చి అమ్మినట్లు నిర్ధారితమైందని. అబ్బినేని అనసూయ తదితరుల నుంచి జీపీఏ తీసుకుని 1980లలో లేఅవుట్ వేయగా, పలు కొనుగోలుదారులు ఆ ప్లాట్లను ఎల్ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకున్నారు అని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 1.20 ఎకరాల పార్కును మూడు భాగాలుగా విడగొట్టి 11 ప్లాట్లు చేయడం బయటపడిందని. మరిన్ని పార్కులు కూడా బై నంబర్ల ద్వారా అమ్మేశారు అని పేర్కొన్నారు.
ఈ భూవ్యవహారాల్లో ఎన్ఐఆర్ లు కూడా “ముడిసరకుగా” ఉపయోగించబడ్డారని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. తరువాత సింహా డెవలపర్స్, వాసవి నిర్మాణ సంస్థలతో పాటు మరికొందరు కొనుగోలు దారులు బౌన్సర్లను పెట్టి, స్థానికులు పార్కు వైపు కూడా వెళ్లనీయకుండా చేశారని నివాసితులు హైడ్రా అధికారుల ముందు వాపోయారు. దీంతో రెసిడెంట్స్ హైకోర్టును ఆశ్రయించగా, పార్కులు ప్రజావసరాల స్థలాలను రక్షించాలని కోర్టు హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకు హైడ్రా వెంటనే చర్యలకు దిగిందన్నారు. శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ప్రజావసరాల భూమిని కాపాడిన హైడ్రాకు వారు ధన్యవాదాలు తెలిపారు.
