
కొండాపూర్‌లో రూ.700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
నగరంలోని ఖరీదైన ప్రాంతమైన కొండాపూర్‌లో భూమాఫియా వేసిన భారీ స్కెచ్‌ను హైడ్రా అధికారులు భగ్నం చేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనగూడ ప్రధాన రహదారి మార్గంలో ఉన్న జంగమోని కుంట ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటను కబ్జాదారులు మాయం చేసేందుకు ప్రయత్నించారు.
దాదాపు రూ. 700 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న కబ్జాదారులు, కుంటలో భారీగా మట్టి పోసి చదును చేశారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్మకానికి కూడా సిద్ధం చేశారు. ఇటీవల జంగమోని కుంట మాయం అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలతో అప్రమత్తమైన హైడ్రా, రెవెన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల్లో ఆక్రమణలు వాస్తవమేనని తేలడంతో, చెరువును పునరుద్ధరించేందుకు హైడ్రా తక్షణ చర్యలు చేపట్టింది. కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని, చెరువు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులపై రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చెరువులను రక్షించడంలో భాగంగా హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్ స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.
