Let's talk: editor@tmv.in
కొండపూర్‌‌లో రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

కొండపూర్‌‌లో రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Gaddamidi Naveen
26 అక్టోబర్, 2025

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కొండపూర్ పరిధిలో మరో భారీ భూకబ్జా ప్రయత్నాన్ని హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ. 86 కోట్ల విలువ చేసే 4300 గజాల ప్రజావసరాల స్థలాన్ని హైడ్రా అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా, వరుసగా రెండో రోజు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.

తప్పుడు డాక్యుమెంట్లతో దందా

కొండపూర్, రాజరాజేశ్వరి నగర్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన 4300 గజాల స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. 1978లో వేసిన గ్రామ పంచాయతీ లేఅవుట్‌లో ఈ స్థలాన్ని పాఠశాల భవనం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించారు.

అయితే, లేఅవుట్ వేసిన చింతల పోచయ్య ఆయన కుటుంబ సభ్యుడు చింతల రాజు ఈ స్థలాన్ని మూడు భాగాలుగా విడదీసి లావాదేవీలు నిర్వహించారు. ఈ దందాలో కొళ్ల మాధవ రెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. మాధవ రెడ్డి కుమారుడు ఒక భాగాన్ని కొనుగోలు చేయగా మిగిలిన రెండు భాగాలను పోచయ్య, రాజు పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మాధవ రెడ్డి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌తో దందా నడుపుతున్నట్లు కాలనీ ప్రతినిధులు హైడ్రా ఫిర్యాదు చేశారు.

రంగనాథ్ ఆదేశాలతో క్రిమినల్ కేసులు

గతంలో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో కాలనీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆక్రమణలను తొలగించి, 4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి, హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.

ఈ భూకబ్జాకు పాల్పడిన పోచయ్య, రాజుతో పాటు స్థలాన్ని కొనుగోలు చేసిన కొళ్ల మాధవరెడ్డి అతని కుమారుడిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు తమ చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు.

కేసులు నమోదు వివరాలు

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో చింతల పోచయ్య, చింతల రాజు, కొళ్ల మాధవ్ రెడ్డి అతని కుమారుడు భూకబ్జాకు సంబంధించిన క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. సాధారణంగా, భూకబ్జా, మోసపు లావాదేవీలు, అక్రమ నిర్మాణాలు వంటి ఘటనల కోసం భారత క్రిమినల్ కోడ్ కింద ఈ విధమైన సెక్షన్లు వర్తిస్తాయి

• సెక్షన్ 441 – అక్రమంగా పరిమితి లేకుండా ఇతరుల స్థలంలో ప్రవేశించడం చేయరాదు.

• సెక్షన్ 420 – మోసం చేయడం – డాక్యుమెంట్లను తప్పుడు ప్రదర్శన ద్వారా లావాదేవీలలో మోసం చేయడం.

• సెక్షన్ 447 – అక్రమంగా కబ్జా చేసుకోవడం

• సెక్షన్ 34 – ఒక కౌన్సిలింగ్ లేదా గుంపుగా ఒక క్రిమినల్ పని చేయడం

• భూమి ఆక్రమణ, మోసం, తప్పుడు డాక్యుమెంట్లతో లావాదేవీల కారణంగా ఇవే సాధారణంగా నమోదు అవుతాయి.

హైడ్రా చేపట్టిన చర్యలు

తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను 19 జూలై 2024న అధికారికంగా స్థాపించింది. ఇది పబ్లిక్ ఆస్తులు కాపాడుకోవడం, ఆక్రమణలు తొలగించడం, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పడ్డ సంస్థ. హైడ్రా ఇప్పటి వరకు ఆక్రమణదారుల నుంచి కాపాడిన మొత్తం భూమి సుమారు 923 ఎకరాల అని హైడ్రా ఆఫీస్ వెల్లడించింది. ఇందులో పార్కులు, కాలువలు, నాళాలు, రోడ్లు మొదలైనవి ఉన్నాయి. అంచనా విలువల భూభాగాల మొత్తాన్ని ప్రభుత్వానికి సుమారు రూ. 50,000 కోట్లు విలువ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక 96 డ్రైవ్స్‌లను నిర్వహించి 581 ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా కమిషనర్ వివరాలుగా వెల్లడించారు.