Let's talk: editor@tmv.in
కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్‌ఐ దాడులు

కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్‌ఐ దాడులు

Panthagani Anusha
14 మార్చి, 2026

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామిక వాడలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ మాదకద్రవ్యాల తయారీ కేంద్రాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు బట్టబయలు చేశారు. ‘ఆపరేషన్ వైట్ హ్యామర్’ పేరుతో అధికారులు నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో సుమారు రూ. 47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ప్రాజొలామ్‌ను స్వాధీనం చేసుకున్నారు. రసాయన తయారీ యూనిట్ ముసుగులో సాగుతున్న ఈ చీకటి వ్యాపారాన్ని చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.

పరిశ్రమ ముసుగులో మత్తు దందా

డీఆర్‌ఐ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 11, 12 తేదీల్లో కొండపల్లి ఐడీఏ లోని ఒక అద్దె ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. పారిశ్రామిక అవసరాల కోసం రసాయనాలు తయారు చేస్తున్నట్లు నమ్మిస్తూ లోపల భారీ స్థాయిలో సింథటిక్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ తనిఖీలు చేపట్టగా 237 కిలోల స్వచ్ఛమైన ఆల్ప్రాజొలామ్‌తో పాటు, దాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల వివిధ రకాల రసాయనాలను సీజ్ చేశారు.

నిపుణుడైన కెమిస్టే సూత్రధారి

ఈ అక్రమ దందా వెనుక రసాయన, ఫార్మాస్యూటికల్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఒక సీనియర్ కెమిస్ట్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రసాయన శాస్త్రంలో తనకున్న పట్టును సమాజానికి కీడు చేసేలా మాదకద్రవ్యాల తయారీకి మళ్లించాడు. ఇతనికి తోడుగా హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ముడి పదార్థాల సేకరణ, తయారైన డ్రగ్స్‌ పంపిణీ బాధ్యతలను చూసుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి కొండపల్లిలో పక్కా ప్రణాళికతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

భారీ యంత్రాల వినియోగం

కేవలం చిన్నపాటి ప్రయోగశాల లాగా కాకుండా ఇది ఒక భారీ పారిశ్రామిక స్థాయి తయారీ కేంద్రంగా ఏర్పడినట్లు సమాచారం. కాగా దాడుల సమయంలో అధికారులు రియాక్టర్లు, భారీ సెంట్రిఫ్యూజ్ వంటి అత్యాధునిక యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద 3.5 టన్నుల రసాయన నిల్వలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

డీఆర్‌ఐ దూకుడు

ఇదిలాఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గూఢచారి సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు ఇప్పటివరకు ఎనిమిది అక్రమ మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాలను నిర్వీర్యం చేయడం విశేషం. తాజాగా కొండపల్లిలో జరిగిన ఈ దాడి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూనుకుందో స్పష్టం చేస్తోంది. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ డ్రగ్స్ ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయి? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.