
కొండగట్టు గిరిప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలించిన కలెక్టర్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం త్వరలో సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. భక్తుల కోరిక మేరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, కొండగట్టు చుట్టూ గిరిప్రదక్షిణ చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సోమవారం కసరత్తు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్వయంగా కొండగట్టులోని రోడ్డు మార్గాన్ని పర్యవేక్షించి, గిరిప్రదక్షిణకు ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అరుణాచలం తరహాలో ప్రణాళికలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తమిళనాడులోని అరుణాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం క్షేత్రాల్లో ఉన్న గిరిప్రదక్షిణ తరహాలోనే కొండగట్టులో కూడా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా గిరిప్రదక్షిణ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, అటవీ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసి, అవసరమైన అంశాలపై చర్చించినట్లు చెప్పారు. గిరిప్రదక్షిణ మార్గం విస్తారంగా ఉండటం అత్యంత కీలకమని పేర్కొంటూ, భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా కనీసం 40 అడుగుల వెడల్పుతో రోడ్డు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మార్గమధ్యలో భక్తులకు త్రాగునీటి సౌకర్యం, శౌచాలయాలు, విశ్రాంతి కేంద్రాలు, కూర్చునే షెడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే రాత్రివేళల్లో కూడా గిరిప్రదక్షిణ చేసే భక్తుల భద్రత దృష్ట్యా సరిపడా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతం గుండా వెళ్లే మార్గాలపై అటవీ శాఖ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
గిరిప్రదక్షిణకు సంబంధించి సమగ్ర అంచనా ప్రణాళికలు సిద్ధం చేసి, వ్యయ అంచనాలతో పాటు అవసరమైన అనుమతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కొండగట్టు ఆలయానికి వచ్చే లక్షలాది భక్తులకు ఈ ప్రణాళిక ద్వారా మరింత సౌకర్యం కలగడంతో పాటు, ఆలయ పరిసర ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి మాదాసు రవి ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
