
కొండగట్టు అంజన్న: ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం
"జీవితంలో కష్టాల కడలి ఎదురైనప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనిషికి గుర్తొచ్చే మొదటి నామం 'రామదూత'. ఆ నమ్మకానికి నిలువెత్తు రూపమే కొండగట్టు అంజన్న. గాలిలో కలిసిన సుగంధంలా, కొండ కోనల మధ్య ప్రతిధ్వనించే రామనామ స్మరణ భక్తులకు కొండంత అండ. ఏడు కొండల వేంకటేశ్వరుని అంశతో, నరసింహుని తేజస్సుతో, తనను నమ్ముకున్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే ఆపద్బాంధవుడు ఆయన. 'నన్ను నమ్మిన వారికి నేనున్నాను' అని అభయమిస్తూ, 400 ఏళ్లుగా ఈ కొండలపై కొలువై ఉన్న ఆంజనేయుడు కేవలం ఒక దైవం మాత్రమే కాదు.. కొన్ని లక్షల కుటుంబాలకు జీవనాధారం, నమ్మకమైన సంజీవని. భక్తుడి కంట నీరు రాకముందే కరిగిపోయే కరుణామయుడు ఆ కొండగట్టు స్వామి." అలాంటి స్వామివారి విశేషాలు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో, దట్టమైన అడవులు కొండల మధ్య కొలువై ఉన్న పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం, కేవలం ఒక ప్రార్థనా స్థలమే కాదు, వేలాది మంది భక్తులకు నమ్మకానికి ప్రతిరూపం. కరీంనగర్ నుండి 40 కి.మీ, జగిత్యాల నుండి 16 కి.మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రం, నిత్యం ‘జై భజరంగబలి’ అనే నామస్మరణతో మారుమోగుతుంటుంది.
క్షేత్ర పురాణం, స్వయంభూ ఆవిర్భావం
కొండగట్టు అంజన్న విగ్రహం మనుషులు చెక్కినది కాదు, ఇది ఒక "స్వయంభూ" మూర్తి. పురాణాల ప్రకారం, ఈ విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సుమారు 500 ఏళ్ల క్రితం, కొడిమ్యాల గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి అడవిలో పశువులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయింది. ఆ ఆవును వెతుకుతూ అలసిపోయిన సంజీవుడు ఒక చెట్టు కింద నిద్రపోయాడు.
ఆ సమయంలో స్వామివారు అతనికి కలలో కనిపించి, తాను ఈ కొండపైనే ఉన్నానని సూచించారు. నిద్రలేచిన సంజీవుడు వెతకగా, శంఖు చక్ర గదధారియై, నరసింహ ముఖం కలిగిన అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అనంతరం సంజీవుడు అతని భార్య ఆశమ్మ కలిసి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుండి నేటి వరకు, ఆ భక్తి వారసత్వం కొనసాగుతూనే ఉంది.
పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంతభాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు. ఈ గుడిని 400 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి సంజీవుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్ తిరిగి నిర్మించారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీబేతాళ స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉంది.
ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, కొండలరాయుని గట్టు, శ్రీవేంకటేశ్వర ఆలయం, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి.
అరుదైన రూపం: త్రిముఖ హనుమాన్
కొండగట్టులో ఉన్న స్వామి వారి విగ్రహం చాలా అరుదైనది. సాధారణంగా హనుమంతుడు అంటే వానర రూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ, నరసింహ స్వామి ముఖంతో ఆంజనేయుడు శివుని అంశ, విష్ణువు యొక్క అవతారమైన నరసింహుని లక్షణాలను కలిగి ఉన్నాడు. స్వామి వారి చేతుల్లో వైష్ణవ సంప్రదాయానికి చిహ్నాలైన శంఖం మరియు చక్రం ఉంటాయి. ఆలయానికి ఉత్తరం వైపున నరసింహ వక్త్రం ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత.
సంజీవని చందనం: ఒక దివ్య ప్రసాదం
ఈ ఆలయంలో భక్తులు అత్యంత పవిత్రంగా భావించేది స్వామి వారి చందనం. స్వామి వారి ఎడమ చేతిలో ఉన్న పాత్ర (గిన్నె) నుండి తీసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనం నుదుట ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోగాలు నయమవుతాయని నమ్మకం. సంతానం లేని దంపతులు ఈ క్షేత్రాన్ని దర్శించి, స్వామి వారి చందనాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని వేలాది మంది భక్తుల అనుభవం చెబుతోంది.
ఈ క్షేత్రం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు నరసింహ వక్త్రం (ముఖం), శంఖు, చక్రాలు, గదను ధరించి అరుదైన రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు చటద శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయం ప్రకారం అత్యంత నిష్ఠతో నిర్వహించబడతాయి. ప్రధాన ఆలయంలో అంజన్నతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, అల్వార్ దేవతలు ఉపాలయాల్లో కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం వైష్ణవ భక్తికి నిలయంగా మారింది. ప్రతి ఏటా చైత్ర, వైశాఖ మాసాల్లో జరిగే చిన, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హనుమాన్ మాల ధరించి, 11, 21 లేదా 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేపట్టి పాదయాత్రగా ఇక్కడికి చేరుకుంటారు. ప్రకృతి ఒడిలో, అటవీ ప్రాంతం మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక ధామం భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతోంది.
కొండగట్టు అంజన్న దీక్ష
శబరిమల అయ్యప్ప దీక్ష తరహాలోనే తెలంగాణలో కొండగట్టు అంజన్న దీక్ష అత్యంత ప్రాచుర్యం పొందింది. భక్తులు 11, 21 లేదా 41 రోజుల పాటు కఠినమైన నియమాలతో దీక్ష చేపడతారు. పాదరక్షలు లేకుండా నడవడం, నేల మీద నిద్రించడం, బ్రహ్మచర్యం పాటించడం, శాఖాహారం మాత్రమే తీసుకోవడం చేస్తారు. దీక్షా కాలం పూర్తయ్యాక, భక్తులు కొండగట్టుకు చేరుకుని స్వామివారికి ఇష్టమైన ‘అభిషేకం’ నిర్వహించి మాల విరమణ చేస్తారు.
నమ్మకాలు, మొక్కులు
శని ప్రభావం ఉన్నవారు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శిస్తే దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.గ్రహ దోష నివారణ పూజలు చేస్తారు. మానసిక స్థితి సరిగా లేనివారు లేదా ‘దయ్యం’ పట్టిందని భావించేవారు ఇక్కడ బేతాళ పూజలు చేయడం వల్ల కోలుకుంటారని భక్తుల నమ్మకం. శివుని అవతారంగా భావించే అంజన్నకు జలంతో అభిషేకం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
పర్యాటక భక్తి కేంద్రం
నేడు కొండగట్టు కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుండి కూడా యాత్రికులను ఆకర్షిస్తోంది. కొండపై ఉన్న సహజసిద్ధమైన గుహలు, కొండ కింద ఉన్న కోనేరు యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
భయాలను పోగొట్టి, ధైర్యాన్ని ప్రసాదించే దేవుడిగా, రోగాలను నయం చేసే వైద్యుడిగా కొండగట్టు అంజన్న కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉన్నాడు. భక్తి, ప్రకృతి, పురాతన చరిత్ర కలిసిన ఈ క్షేత్రం ప్రతి ఒక్కరూ సందర్శించదగిన ఆధ్యాత్మిక ధామం.
దర్శన సమయాలు
ఆలయం ప్రతిరోజూ తెల్లవారుజామున తెరుచుకుంటుంది. ఉదయం 4:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు భక్తుల దర్శనార్ధం ఆలయం తెరిచ్చిఉంటుంది. మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 3:00 వరకు (అలంకరణ, విరామం). తిరిగి సాయంత్రం: 3:00 నుండి రాత్రి 8:30 వరకు ధర్శన సమయం . హనుమాన్ జయంతి, మంగళ, శనివారాల్లో భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు పొడిగించబడతాయి.
రవాణా సౌకర్యాలు
కొండగట్టు జగిత్యాల జిల్లాలో ప్రధాన రహదారికి సమీపంలో ఉండటం వల్ల చేరుకోవడం చాలా సులభం. బస్సు ద్వారా అయితే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాల నుండి (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్) జగిత్యాల లేదా కరీంనగర్‌కు బస్సులు ఉంటాయి. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే ప్రతి బస్సు కొండగట్టు స్టాప్ దగ్గర ఆగుతుంది. అక్కడ నుండి కొండ పైకి వెళ్ళడానికి ఆటోలు, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. రైలు ద్వారా చేరుకోవాలంటే సమీప రైల్వే స్టేషన్ జగిత్యాల (లింగంపేట్) కాగా, మరో ప్రధాన స్టేషన్ కరీంనగర్. ఇక్కడి నుండి టాక్సీ లేదా బస్సులో 1 గంటలో ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్ (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం). ఇది సుమారు 220 కి.మీ దూరంలో ఉంది.
వసతి సౌకర్యాలు
దేవస్థానం కాటేజీలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉంటాయి. తక్కువ ధరకే గదులు అందుబాటులో ఉన్నాయి. కొండ కింద, జగిత్యాల పట్టణంలో (16 కి.మీ) మంచి ఏసీ నాన్-ఏసీ హోటళ్లు అందుబాటులో ఉంటాయి.
ఆలయానికి వచ్చే భక్తుల కోసం మధ్యాహ్నం వేళ ఉచిత అన్నదాన సౌకర్యం ఉంటుంది. ఆలయ కౌంటర్లలో స్వామివారి పవిత్ర లడ్డూలు, పులిహోర ప్రసాదం విక్రయిస్తారు.
యాత్రికుల కోసం సూచనలు
స్వామి వారి ఎడమ చేతి నుండి తీసిన చందనాన్ని ప్రసాదంగా తీసుకోవడం మర్చిపోకండి. ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. కొండ ప్రాంతం కాబట్టి కోతులు ఎక్కువగా ఉంటాయి. మీ వస్తువులను, ముఖ్యంగా ప్రసాదాలు, బ్యాగులను జాగ్రత్తగా చూసుకోవాలి.
