Let's talk: editor@tmv.in
కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
4 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. తమ ఇలవేల్పుగా భావించే ఆంజనేయస్వామి సన్నిధికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం 2024లో ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు వేస్తూ, రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) సహకారంతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం అలాగే 96 గదుల సత్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కొండగట్టు అంజన్న క్షేత్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా ప్రసంగించారు. అభివృద్ధి పనులు ప్రారంభించాలంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది అని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను ఎదుర్కొన్న విద్యుత్ ప్రమాదం నుంచి అంజన్నే తనను ప్రాణాలతో కాపాడారని ఆయన గుర్తు చేసుకున్నారు.

గత పర్యటనలో భక్తులు కోరిన విధంగా, టీటీడీ, తెలంగాణ నాయకుల సమష్టి కృషితో నేడు దీక్ష విరమణ మండపం, సత్రం నిర్మాణానికి నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమక్షంలో ఈ పనులు ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఆలయ పర్యటన విశేషాలు

ఉదయం సుమారు 11 గంటల సమయంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఉప ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి సంప్రదాయబద్ధంగా ఉప ముఖ్యమంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు.

అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయంలో ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు కూడా అర్చనలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాన్ని ప్రసాదించారు. దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో టి. శ్రీకాంతరావులు స్వామివారి చితపటాన్ని పవన్ కళ్యాణ్ కు బహూకరించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు బి. ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవింద్ హరే, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆర్.కె. సాగర్ తదితరులు పాల్గొని శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులతో భక్తులకు మరింత సౌకర్యాలు కలగనున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.