
కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. 30 దుకాణాలు దగ్ధం, రూ.కోట్లలో నష్టం!
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రాంతం నుండి కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు వేగంగా వ్యాపించింది. కాలిపోయిన వాటిలో ఎక్కువగా బొమ్మల దుకాణాలు, ఇతర చిన్నపాటి వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా త్వరలో జరగబోయే సమ్మక్క- సారలమ్మ జాతర కోసం వ్యాపారులు తమ దుకాణాల్లో భారీగా సరుకును నిల్వ చేసుకున్నారు.
ఒక్కో దుకాణంలో దాదాపు రూ.8 నుంచి రూ.10 లక్షల విలువైన సరుకు ఉంటుందని, దీంతో అనేక మంది చిరు వ్యాపారులు ఒక్క రాత్రిలోనే సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటలు అప్పటికే వేగంగా వ్యాపించి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నా, వాటి ఆలస్యం వల్ల నష్టం భారీగా జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ప్రమాదంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. కొండగట్టు అగ్నిప్రమాదం దురదృష్టకరమని, 30 మంది చిరు వ్యాపారుల దుకాణాలు దగ్ధమయ్యాయని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన కలెక్టర్
కొండగట్టు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదివారం స్వయంగా సందర్శించి పరిశీలించారు. ప్రమాద స్థలంలో ఏర్పడిన పరిస్థితులు, మంటల నియంత్రణ చర్యలు, జరిగిన నష్టం గురించి అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన సహాయం అందేలా చూడాలని కలెక్టర్ సంబంధిత శాఖలకు సూచించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన కేటీఆర్
కొండగట్టు అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడిన కేటీఆర్, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని కేటీఆర్ ఆవేదన చెందారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనం అయిందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ఆస్తి నష్టం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
ఈ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. "కొండగట్టు స్టేజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ఘటన బాధాకరం. ఇదే అంశంపై జగిత్యాల జిల్లా కలెక్టర్‌కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు నిర్వాసితులకు అండగా నిలవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది" అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
