Let's talk: editor@tmv.in
కైతల్ ఎస్పీపై మంత్రి అనిల్ విజ్ ఆగ్రహం

కైతల్ ఎస్పీపై మంత్రి అనిల్ విజ్ ఆగ్రహం

Pinjari Chand
15 ఫిబ్రవరి, 2026

హర్యానా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనిల్ విజ్ కైతల్ జిల్లా ఎస్పీ ఉపాసనపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూ విక్రయానికి సంబంధించి మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఎస్పీ కారణాలు చూపుతూ అమలు చేయలేదని ఆయన అన్నారు. జిల్లా గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సమావేశంలో ఈ అంశంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఫిర్యాదుదారు ఒక పోలీసు అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దర్యాప్తును అడ్డుకుంటున్నాడని ఫిర్యాదు చేశారని విజ్ తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అతడిని సస్పెండ్ చేయాలని తాను ఆదేశించానని చెప్పారు. అయితే ఆ అధికారి మరో జిల్లాకు బదిలీ అయ్యాడని, తన పరిధిలో లేడని ఎస్పీ పేర్కొంటూ కారణాలు చెప్పారని విమర్శించారు. సమావేశంలో మంత్రి విజ్ వెంటనే సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయాలని ఎస్పీకి సూచించగా, ఆ అధికారి కర్నాల్ జిల్లాకు చెందినవాడని, తన అధికార పరిధిలో సస్పెన్షన్ సాధ్యం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. ఆమె డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)కి నివేదించగలమని తెలిపారు. దీనిపై ఆగ్రహించిన విజ్, హర్యానా మొత్తంలో ఎవరినైనా నేను సస్పెండ్ చేయగలను అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తరువాత నియమాల ప్రకారం లేఖ రాసి డీఐజీకి పంపాలని సూచించారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేసు వివరాలు

దర్యాప్తు సంస్థల ప్రకారం, ఏఎస్ఐ సందీప్ భూమి విక్రయానికి సంబంధించి ఒక కొనుగోలుదారుడి నుంచి రూ.7 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. భూమి పత్రాలు సరిగా లేవని తేలడంతో ఒప్పందం రద్దయి, డబ్బు తిరిగి ఇవ్వాలని కొనుగోలుదారు కోరాడు. కానీ డబ్బు ఇవ్వకపోవడంతో కైతల్‌లోని టిత్రామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తరువాత సందీప్ తన ప్రభావాన్ని ఉపయోగించి కేసు దర్యాప్తు కొనసాగకుండా, కర్నాల్ ఎకనామిక్ సెల్‌కు బదిలీ చేయించాడని ఆరోపణలు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన విజ్, ఆ పార్టీని రామలీలా పార్టీగా అభివర్ణించారు. రామలీలలో నటులు రాముడి, రావణుడి పక్షాలుగా మారినట్లే కాంగ్రెస్ నేతలు సందర్భానుసారంగా వర్గాలు మార్చుకుంటారని వ్యాఖ్యానించారు. మొత్తంగా, కైతల్ ఎస్పీతో జరిగిన వివాదం రాజకీయంగా చర్చనీయాంశమవుతుండగా, మంత్రి విజ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రజల సమస్యలు లెవనెత్తితే ఎవరూ అడ్డుకోరు

ప్రధాన మంత్రి అస్సాంలోని దిబ్రూగఢ్‌లో హైవేపై భారీ విమానంతో దిగిన సంఘటన దేశానికి చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనలపై స్పందిస్తూ, ప్రజల సమస్యలు లేవనెత్తితే ఎవరూ అడ్డుకోరని అన్నారు. అదేవిధంగా భారత వాయుసేనకు 114 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశాన్ని ప్రస్తావిస్తూ, దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. హైటెక్ ట్యాంకులు, ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.