
కేసీఆర్ సంక్షేమ పథకాలన్నీ నిలిపివేశారు: హరీష్ రావు
సంగారెడ్డి నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి, హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పదేళ్లపాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనను ప్రజలు చూశారని, ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనతో పోల్చుకుంటున్నారని అన్నారు. ఇటీవల కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు తనను కలిసి తమ సమస్యలను వివరించారని తెలిపారు. వారికి ఉద్యోగాలు కల్పించింది, పర్మినెంట్ చేసింది, జీతాలు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమేనని తాను గుర్తు చేశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మోసపోయామని ఉద్యోగులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000కు పెంచారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4000 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. గత 24 నెలల్లో ఒక్కో వృద్ధుడికి సుమారు రూ.52 వేల మేర పెన్షన్ బాకీ పడిందని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని కూడా ఆయన విమర్శించారు.
కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇస్నాపూర్ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు ఉండేవని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మళ్లీ విద్యుత్ కోతలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆటో డ్రైవర్లకు నష్టం కలిగిందని, ఇతర ప్రయాణికులపై భారాన్ని పెంచుతున్నారని హరీష్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి భాషా ప్రయోగాలపై కూడా హరీష్ రావు విమర్శలు చేశారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే తీరు మర్యాదపూర్వకంగా ఉండాలని, అసెంబ్లీలో ఉపయోగిస్తున్న భాష సరైనది కాదని అన్నారు. బతుకమ్మ చీరలు, రైతుబంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోయాయని ఆరోపిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుతం కొనసాగడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హరీష్ రావు కోరారు. అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలు మళ్లీ అమలులోకి రావాలన్నా బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
