
కేసీఆర్ విజయాలను రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారు: రావుల శ్రీధర్ రెడ్డి
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రేవంత్ రెడ్డి మాటలు పరస్పర విరుద్ధంగా ఉండటమే కాకుండా, రాజకీయ సౌలభ్యం కోసం ఆయన అబద్ధాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి బుధవారం ఆరోపించారు.
కేరళ సీఎం పినరయి విజయన్‌తో జరుగుతున్న మాటల యుద్ధంలో రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కేరళ సీఎం పినరయి విజయన్ లేఖకు సమాధానమిస్తూ.. ఇది కేరళ, తెలంగాణ మధ్య జరుగుతున్న పోరాటం కాదని రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పాలన అధ్వాన్నంగా ఉందని విమర్శించడం హాస్యాస్పదమని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం చేసుకుంటున్నారని, అయితే ఇవన్నీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి అని శ్రీధర్ రెడ్డి గుర్తుచేశారు.
ఈ విజయాలు కేవలం ఏడాదిన్నరలో వచ్చినవి కావు. కేసీఆర్ వేసిన బలమైన పునాది, సరైన ప్రణాళిక, పటిష్టమైన అమలు వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనను తప్పుబడుతూనే, అదే కేసీఆర్ సాధించిన అభివృద్ధి సూచికలను తనవిగా రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
