Let's talk: editor@tmv.in
కేసీఆర్ వారసత్వాన్ని మీ మాటలు అడ్డుకోలేవు: కేటీఆర్

కేసీఆర్ వారసత్వాన్ని మీ మాటలు అడ్డుకోలేవు: కేటీఆర్

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి వాడిన భాష అత్యంత దారుణంగా ఉందని, ఆయన స్థానం "మురికిగుంట"లోనే అని కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, రేవంత్ రెడ్డి వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నోరు తెరిస్తే కేవలం బూతులు మాత్రమే వస్తున్నాయని, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో 500 రోజుల శిక్షణ పొందినా సంస్కారం అబ్బదని కేటీఆర్ విమర్శించారు. కుక్క తోక వంకర అన్న చందంగానే ముఖ్యమంత్రి తీరు ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారని, అటువంటి వ్యక్తిపై విషం చిమ్మడం రేవంత్ రెడ్డి అహంకారానికి, పరిపాలనా అసమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. "కుక్కను తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెడితే అది సింహం అవ్వదు. అది ఆ సింహాసనానికే అవమానం" అంటూ కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు.

మరోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులతో పాటు సామాన్య దంపతుల మధ్య జరిగే సంభాషణలను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని, ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తికి తనను తాను రాష్ట్ర పిత అని పిలుచుకునే అర్హత లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

కేసీఆర్ వారసత్వాన్ని మీ మాటలు అడ్డుకోలేవు: కేటీఆర్ - Tholi Paluku