
కేసీఆర్, బీఆర్‌ఎస్‌ల రాజకీయ పతనమే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి: సీఎం రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు ఇచ్చే అసలైన నివాళి.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేయడమేనని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు.
మాజీ సీఎం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ విధానాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. సభలో తెలుగు దేశం పార్టీ జెండాలు విస్తృతంగా కనిపించడంతో, తెలంగాణలో ఎన్టీఆర్‌ను అభిమానించే వారు, చంద్రబాబు నాయుడును అనుసరించే వారు ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి వారందరికీ తన విజ్ఞప్తి ఏమిటంటే.. తెలంగాణలో టీడీపీని అంతమొందించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ రాజకీయాలను 100 అడుగుల లోతులో పాతిపెట్టాలని సీఎం అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి, ఆ పార్టీ జెండా స్థంభాల పునాదులనే ధ్వంసం చేసినప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన ఘన నివాళి అవుతుందని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రతి సంవత్సరం రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఉంటే, ఇప్పటివరకు 20 లక్షల ఇళ్లు పూర్తయ్యేవని ఆయన విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
