Let's talk: editor@tmv.in
కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్ సర్కార్ డిఫెన్స్‌లోకి: హరీష్ రావు

కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్ సర్కార్ డిఫెన్స్‌లోకి: హరీష్ రావు

Gaddamidi Naveen
24 డిసెంబర్, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, రాజకీయ కక్షసాధింపు చర్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9.30 గంటలకు మీడియా చిట్‌చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదని, అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్‌మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ రాజకీయ శక్తికి నిదర్శనమని అన్నారు.

పాలనపై విమర్శలు

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోలు, గ్లోబల్ సమ్మిట్‌లు పేదవాడి ఆకలి తీర్చుతాయా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందని, వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు కూడా ఎక్కడం లేదని ఎద్దేవా చేశారు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. గ్రామస్థాయి ఎన్నికల్లో 4,000 మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో సీఎం రేవంత్‌రెడ్డికి ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే కోఆపరేటివ్ ఎన్నికలు నిర్వహించకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దమ్ముంటే కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు.

ఉస్మానియా యూనివర్సిటీకి ఒంటరిగా వస్తానని గొప్పలు చెప్పిన సీఎం వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారని, విద్యార్థి నాయకులను ముందే అరెస్టు చేయించడం ఆయన పిరికితనానికి నిదర్శనమని హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. సాగునీటి అంశంపై ప్రభుత్వం ఇస్తున్న పీపీటీని స్వాగతిస్తున్నామని, అయితే వాస్తవాలు చెప్పేందుకు బీఆర్ఎస్‌కూ సమాన అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీలకు ఇచ్చిన సమయంతో పోలిస్తే తమకు తక్కువ సమయం ఇచ్చి గొంతు నొక్కుతున్నారని, మైకులు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు.

అప్పుల కోసం "బ్రోకర్" వ్యవస్థ?

ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వం కాదని, ఒక కన్సల్టెన్సీ కంపెనీలా మారిందని హరీశ్‌రావు ఆరోపించారు. బొంబాయి బ్రోకర్ల సలహాలతో పాలన సాగుతోందని, అప్పులు ఇప్పించినందుకు గతంలోనే ఒక బ్రోకర్ కంపెనీకి రూ.180 కోట్ల కమిషన్ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ.30 వేల కోట్ల అప్పు తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.

నీటి వాటాలపై చారిత్రక తప్పిదం.

సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ.7,000 కోట్లను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు పంచుకున్నారని, 20 శాతం కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకే బిల్లులు ఇస్తున్నారని హ‌రీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కేవలం 28.49 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణకు 45 టీఎంసీలు చాలని ఉత్తమ్‌రెడ్డి లేఖ రాయడం చారిత్రక తప్పిదమని, దానికి క్షమాపణ చెప్పి వెంటనే 90 టీఎంసీల కోసం మరో లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్

ప్రభుత్వం ఇరుకుల్లో పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అంటూ లీకులు ఇచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని హ‌రీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఈ సిట్ ఒక పెద్ద జోక్‌గా మారిందన్నారు. సీఎం మెప్పుకోసం అక్రమ కేసులు పెట్టే పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుందని హెచ్చరించారు.

ఉద్యమ కాలంలో తనపై 300 కేసులు ఉన్నాయని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి జిల్లా సర్జాపూర్‌లో ఓటేయలేదన్న కారణంతో దళితులపై దాడులు చేసి ఇళ్లు కూలగొట్టినా పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని హ‌రీష్ రావు ఆరోపించారు. ఖాకీ పుస్తకం, చట్టం అందరికీ సమానంగా ఉండాలని స్పష్టం చేశారు. కానిస్టేబుళ్ల ఆరోగ్య భద్రతను రూ.లక్షకు కుదించడం దుర్మార్గమని, వారి టీఏ, డీఏ అలవెన్స్‌లపై డీజీపీ దృష్టి పెట్టాలని హ‌రీష్ రావు కోరారు.

యాదగిరిగుట్టలో దేవుడి మీద ఒట్టు వేసి రుణమాఫీ చేయలేదని ప్రార్థించగా తనపై కేసు పెట్టారని, ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు దాడులు చేశారని ఆయ‌న‌ గుర్తుచేశారు. ఎన్ని కేసులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ఆయ‌న‌ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను తెచ్చిన చరిత్ర తమదేనని, త్యాగాల బాటలో వచ్చిన పార్టీని అక్రమ కేసులు, కుట్రలతో భయపెట్టలేరని హ‌రీష్ రావు స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్ సర్కార్ డిఫెన్స్‌లోకి: హరీష్ రావు - Tholi Paluku