Let's talk: editor@tmv.in
కేసీఆర్ పై రాజకీయ కక్షసాధింపు... రేవంత్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: కౌశిక్ రెడ్డి

కేసీఆర్ పై రాజకీయ కక్షసాధింపు... రేవంత్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: కౌశిక్ రెడ్డి

Gaddamidi Naveen
1 ఫిబ్రవరి, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ నోటీసులు జారీ చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన (ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు.

తెలంగాణ జాతి పితగా, కోట్లాది ప్రజల విశ్వాస ప్రతీకగా నిలిచిన కేసీఆర్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి, దశాబ్దకాలం పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన మహానేతపై ఈ తరహా చర్యలు శోచనీయమన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనలో విఫలమై ప్రజలసమస్యలను పరిష్కరించలేకపోతుందని, ఆ వైఫల్యాలను దాచిపెట్టేందుకు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. సింగరేణి బొగ్గు అంశంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయంలో, కేసీఆర్ పై దాడులు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయ‌న ఆరోపించారు.

ఇలాంటి రాజకీయ కక్షపూరిత చర్యలతో ప్రజలను మభ్యపెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోందని, ఇది ప్రభుత్వ అహంకారానికి, రాజకీయ అవివేకానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే అచంచలంగా నిలబడి ఉన్నారని ప్రభుత్వం గుర్తించాలని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇలాంటి చర్యలను తక్షణమే విరమించుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.