
కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలే నవ్వుతారు: మంత్రి ఉత్తమ్
లక్ష మందితో కాళేశ్వరానికి పాదయాత్ర చేస్తే ప్రజలే నవ్వుతారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పియర్లు(పిల్లర్లు) కుంగిన నేపథ్యంలో.. కేసీఆర్ అక్కడికి ఏ ముఖంతో వెళ్తారని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ప్రస్తుత నీటి సమస్యకు ఎల్‌నినో ప్రభావంతోపాటు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు కూడా కారణమని ఉత్తమ్ ఆరోపించారు. నీటి కష్టాలపై మాట్లాడే ముందు కేసీఆర్ పదేళ్ల పాలనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి రంగంపై కేసీఆర్‌కు సరైన అవగాహన లేదని, శాస్త్రీయ ప్రణాళికల కంటే రాజకీయ ప్రచారానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.
‘లక్ష కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారు?’
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసినప్పటికీ మేడిగడ్డ పియర్లు ఎందుకు కుంగిపోయాయని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రాజెక్టును సక్రమంగా నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం నిర్మాణ లోపాలపై ఇప్పటికే పలు నివేదికలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదే మొత్తంతో మరో ఏడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉండేదని అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి కాకుండా అడ్డుకున్నది ఎవరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. జూరాల, దిండి ప్రాజెక్టులను పదేళ్లపాటు ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ వ్యవస్థను నాశనం చేశారని, సాగునీటి రంగంలో కేసీఆర్ పనితీరు ‘సున్నా’ అని విమర్శించారు.
‘బూతుల సంస్కృతికి బీజం వేసింది కేసీఆరే’
రాజకీయాల్లో భాష దిగజారడానికి కేసీఆర్ కారణమని ఉత్తమ్ ఆరోపించారు. బూతుల భాష మాట్లాడినప్పుడు కేసీఆర్ తనను తాను హీరోగా భావించారని, అదే భాషను ఆయనపై ప్రయోగిస్తే ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బూతుల సంస్కృతికి బీజం వేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా రాజకీయాల్లో ఇంత దిగజారుడు భాషను చూడలేదని ఉత్తమ్ అన్నారు. రాజకీయ విమర్శలకు హద్దులు, ప్రజాస్వామ్యానికి మర్యాద ఉండాలని సూచించారు. కాళేశ్వరం పాదయాత్ర చేయడం కంటే కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిదని మంత్రి వ్యాఖ్యానించారు.
