
కేసీఆర్ దీక్షే తెలంగాణ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్: కేటీఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ చేపట్టిన 2009 నిరాహార దీక్షను మలుపు చేసిన ఘట్టంగా గుర్తు చేస్తూ ‘దీక్షా దివస్’ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలను పదే పదే ద్రోహం చేసిన కాంగ్రెస్ ఈ రాష్ట్ర చరిత్రలో ‘శాశ్వత విలన్’గా నిలిచిందని మండిపడ్డారు. 2009లో కేసీఆర్ చేసిన నిరాహార దీక్షను ప్రజాస్వామ్య నిరసన ఉద్యమాలలో ఒక నిర్ణయాత్మక క్షణంగా అభివర్ణించిన కేటీఆర్, దానిని భారత స్వాతంత్ర్య పోరాటంలోని మలుపులతో పోల్చారు. ఈ నిరాహార దీక్ష సమాజంలోని అన్ని వర్గాలకు శక్తినిచ్చిందన్నారు. తెలంగాణ ఆందోళనను తిరుగులేని శక్తిగా మార్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ పదవులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే రాజీనామా చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ కోసం కాదు… తెలంగాణ కోసం ప్రాణాలర్పించారు
తమ జీవితాల్లో ఆనందం చూడకుండా తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టిన యువత త్యాగాలను కాంగ్రెస్ మరచిపోయిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అవమానాలు, అన్యాయాల పాలైంది. ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే అది మూడు అక్షరాల ‘కే-సి-ఆర్’ వల్లే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తాం
సెక్రటేరియట్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి… తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ‘తెలంగాణ గౌరవం మా కోసం మాట కాదు మతం’ అని కేటీఆర్ తెలిపారు.
పీసీసీ చీఫ్ అప్పట్లో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు ఆ రోజుల్లో ఉద్యమం మంటకలిసి దహనమవుతుంటే ఈ రోజు బడాయిగా మాట్లాడుతున్న ఈ పీసీసీ చీఫ్ ఎక్కడున్నారో?
కేసీఆర్ దీక్ష వల్ల ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు కూడా భయపడి వెనక్కి తగ్గారని కేటీఆర్ పీసీసీ చీప్ మహేశ్ గౌడ్ ను విమర్శించారు. కాంగ్రెస్ నేతలు యువత రక్తంతో చేతులు కడుక్కున్నారని తీవ్రంగా విమర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా ఎందుకు చేయించరు?
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించి… ప్రజల ముందుకు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. సోనియాగాంధికి ధన్యవాదాలు చెప్పాం. కానీ ‘బలి దేవత’ అని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అలా ఎవరు అన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కావాలంటే మమ్మల్ని తిట్టండి… కానీ తెలంగాణను తిట్టొద్దండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
దీక్షా దివస్ కూడా దసరా పండుగే
అన్యాయంపై న్యాయం గెలిచిన రోజుగా ఈ దివస్‌ను జరుపుకోవాలన్నారు. తెలంగాణ చరిత్ర, వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. రాణి రుద్రమ దేవి, సమ్మక్క-సారలమ్మ, కొమురం భీం, చాకలి ఐలమ్మలను స్మరించుకుంటూ ఢిల్లీ దాస్యపు మనస్తత్వాన్ని ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు.మౌనంగా ఉన్నా కేసీఆర్ రాజకీయాలను కదిలిస్తాడు. ఆయన స్వరంతో తెలంగాణ మళ్లీ ఉవ్వెత్తున్న లేస్తుంది అంటూ తన ప్రసంగాన్ని కేటీఆర్ ముగించారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్‌కు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీక్షా దివస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ ను ఘనంగా స్మరించుకున్నారు.
హిల్ట్–పీ పైన మరో బాంబు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం “భారతదేశ చరిత్రలో అతిపెద్ద భూ స్కాం”కి తలపెడుతోందని ఆరోపించారు. ఈ దందాతో రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు నష్టం జరుగుతుందని ఈ డీల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
