Let's talk: editor@tmv.in
కేసీఆర్ ‘దళిత’ వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ‘దళిత’ వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
30 మార్చి, 2026

తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనే కాకుండా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా దళితులను అవమానిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని నాడు కేసీఆర్ ఇచ్చిన హామీని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఆ మాట తప్పి కేసీఆర్ దళిత సామాజిక వర్గాన్ని దారుణంగా వంచించారని విమర్శించారు. కేసీఆర్ ఒక దళిత వ్యతిరేకి. గతంలో భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయనను కనీసం సహించలేకపోయారు అని సీఎం ధ్వజమెత్తారు.

స్పీకర్‌ను ఎదుర్కోలేకే సభకు రావడం లేదు

ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆయనను ఎదుర్కోవడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రావడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు పదేపదే గందరగోళం సృష్టిస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

2014 నుంచి 2018 మధ్య కాలంలో బీఆర్ఎస్ ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపుల గురించి ప్రస్తావిస్తూ సీఎం సెటైర్లు వేశారు. అలాగే మంత్రి సీతక్క పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభలో సీనియర్ నాయకులను, మహిళా మంత్రులను అవమానించడం బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ వైఖరి మొదటి నుంచి దళిత, వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగానే ఉందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. అసెంబ్లీలో సీనియర్ నేతలను అవమానించడం సరికాదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సీఎం సూచించారు.