
కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలు సరికాదు, నా రక్తం మరిగిపోతోంది: కవిత
తెలంగాణ శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే. కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఉగ్రవాది కసబ్‌తో పోల్చుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిపై ఇలాంటి అవమానకరమైన, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని కవిత అన్నారు.
కేసీఆర్ కుమార్తెగా ఇలాంటి మాటలు విన్నప్పుడు నా రక్తం మరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణం పోసిన నాయకుడిపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి హోదాకు ఏమాత్రం తగదు. ఇవి ఒక సీఎం నోటి నుంచి రావాల్సిన మాటలు కావు అని కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అలాగే పాలమూరు ప్రాజెక్టుల అంశంపై కూడా కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే అపారమైన అవగాహన, అనుభవం కేసీఆర్ కే ఉందని ఆమె పేర్కొన్నారు. ఇంత కీలకమైన నీటి ప్రాజెక్టుల విషయాన్ని బాధ్యతలేని, అవగాహన లేని ‘బబుల్ షూటర్స్’ చేతుల్లో పెట్టడం రాష్ట్ర ప్రయోజనాలకు హానికరమని ఆమె విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలపై బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని కవిత హితవు పలికారు. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ముఖ్యమంత్రిని ఆమె కోరారు.
కవిత తన పదవికి రాజీనామా చేసిన అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ను ఆమె శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని, తన రాజీనామాను స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను నాలుగు నెలల క్రితమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని, అయితే ఇప్పటివరకు అది ఆమోదం పొందలేదని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ను కలిసి, సభ వేదికపై తన వాదనను వివరించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తనపై జరిగిన పరిణామాలు, రాజకీయంగా తనకు ఎదురైన పరిస్థితులపై సభ ముందు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేసినట్లు ఆమె వెల్లడించారు.
సభ వేదికపై నా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఇచ్చిన తర్వాత, ఆ రోజే నా రాజీనామాను సభలోనే ఆమోదించాలని కోరతాను. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారని. నా వాదన వినిపించేందుకు తేదీని త్వరలోనే తెలియజేస్తామని హామీ ఇచ్చారు అని కవిత తెలిపారు. శాసనమండలిలో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుండగా కవిత సభలో ఏమి మాట్లాడతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
