
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కోదాడలో బీఆర్ఎస్ ధర్నా
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తుగ్లక్ పాలనను తలపించేలా ప్రవర్తిస్తూ హింసను ప్రేరేపించే భాషను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
రైతుల ప్రయోజనాల కోసం కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి సాగునీరు అందించాలని కోరితే, ప్రతిపక్షాల గొంతులు కోస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఇలాంటి అహంకారపూరిత, క్రూరమైన పాలన రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాభావం, సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతికొచ్చిన నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారాన్ని వీడి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
