
కేసీఆర్‌ను కలిసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావును రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఎర్రవెల్లిలోని కెసిఆర్ నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
మేడారం జాతరకు ఆహ్వానం
త్వరలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రావాలని ప్రభుత్వం తరఫున కేసీఆర్‌ను మంత్రులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శాలువా కప్పి, ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేశారు.
తెలంగాణ సంప్రదాయంతో సత్కారం
తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్, శోభమ్మ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఆడబిడ్డలు ఇంటికి వచ్చిన వేళ, తెలంగాణ సంప్రదాయం ప్రకారం వారికి పసుపు కుంకుమలు, చీరలు, తాంబూలాలు అందజేసి కేసీఆర్ దంపతులు సత్కరించారు.
ఇష్టాగోష్టి, యోగక్షేమాలు
ఈ భేటీలో రాజకీయాల కంటే ఎక్కువగా ఆత్మీయ పలకరింపులే చోటుచేసుకున్నాయి. కేసీఆర్ దంపతులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న మంత్రులు, కాసేపు వారితో ఇష్టాగోష్టిగా గడిపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యారు.
ప్రధాన ప్రతిపక్ష నేతను మంత్రులు కలవడం, ఆయన సాదరంగా ఆహ్వానించి సంప్రదాయబద్ధంగా సత్కరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.
