Let's talk: editor@tmv.in
కేసీఆర్‌ది నీళ్ల ద్రోహం.. తెలంగాణకు తీరని అన్యాయం!: మంత్రి జూపల్లి

కేసీఆర్‌ది నీళ్ల ద్రోహం.. తెలంగాణకు తీరని అన్యాయం!: మంత్రి జూపల్లి

Gaddamidi Naveen
23 డిసెంబర్, 2025

వరుస ఓటములతో ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల తర్వాత బయటకు రావడంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆయన పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రజాప్రభుత్వంపై రెఫరెండంగా అభివర్ణించిన కేటీఆర్‌కు ప్రజలు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటో వంతు సీట్లు కూడా దక్కించుకోలేకపోవడం వారి ప్రజాధారణ ఏ స్థాయిలో పడిపోయిందో వెల్లడిస్తోందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోవడం వారి పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని జూపల్లి విమర్శించారు. ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన కేసీఆర్, పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించలేకపోయారని మండిపడ్డారు. 2023 ఎన్నికల సమయంలో నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఒక మోటార్ ఆన్ చేసి ‘జాతికి అంకితం’ చేసినట్లు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారని మంత్రి ఆరోపించారు.

నీటి కేటాయింపులు లేకుండా, అవసరమైన కేంద్ర అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించడం కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మంత్రి తెలిపారు. పర్యావరణ అనుమతులు పొందకుండా పనులు చేపట్టడంతో గ్రీన్ ట్రిబ్యునల్ రూ.400 కోట్ల జరిమానా విధించిందని మంత్రి గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తికావాలంటే ఇంకా రూ.40 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని, అంటే బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అవ్యవస్థిత నిర్ణయాల భారం ఇప్పుడు రాష్ట్రంపై పడిందన్నారు.

కృష్ణా జలాల్లో చారిత్రక ద్రోహం

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాల వాటాను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టిన ఘనత కేసీఆర్‌దేనని జూపల్లి ఆరోపించారు. కృష్ణా నదీ జలాల వాటాల విషయంలోను తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని జూపల్లి పేర్కొన్నారు. నదీపరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకు దక్కాల్సిన మేజర్ వాటాను ఏపీకి వదిలివేయడం ద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయ‌న విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని కేటాయిస్తే, కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించడం ద్వారా తెలంగాణకు ద్రోహం చేశారని మంత్రి అన్నారు.

అంతేకాదు, నదీపరివాహక ప్రాంతం తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 511 టీఎంసీలు అప్పగించేందుకు కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.కృష్ణా జలాలపై తెలంగాణకు రావాల్సిన హక్కులను కాపాడడంలో విఫలమైన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ప్రజల ముందు నీతులు చెప్పడం సిగ్గుచేటని మంత్రి అన్నారు.

అప్పుల కుప్ప.. అభివృద్ధి సున్నా

ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్, పాలమూరు ప్రాజెక్టును గాలికొదిలేశారని మంత్రి మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఏం చేయలేని వారు, ఇప్పుడు బయటకు వచ్చి నీతులు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని ఆయన పునరుద్ఘాటించారు.