Let's talk: editor@tmv.in
కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ..

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ..

Sirisha B
11 ఏప్రిల్, 2026

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు.ఇటీవల జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ అయిన అనంతరం ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత 27 నెలలుగా కాంగ్రెస్ పాలనలో తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు తాజా పరిణామాల నడుమ ఆత్మీయంగా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఎర్రవెల్లి నివాసం వద్ద సందడి నెలకొంది. జీవన్ రెడ్డి రాకకు గుర్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు.

"ఆ దేవుడే నన్ను పంపాడు.."

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన తరుణంలో జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "అన్నా.. తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్న తరుణంలో నీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భావించాను. అందుకే ఆ దేవుడే నన్ను నీ దగ్గరకు పంపాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ నీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది" అని పేర్కొన్నారు.

జీవన్ రెడ్డి మాటలకు కేసీఆర్ ఆత్మీయంగా స్పందించారు. ఆయనను దగ్గరకు తీసుకుని, ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ కాసేపు వ్యక్తిగత, రాజకీయ అంశాలపై ఇష్టాగోష్టిగా చర్చించుకున్నారు.

రైతు నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి రాకను తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా కీలక పరిణామంగా నేతలు అభివర్ణించారు. సమావేశం అనంతరం కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి, ఆయన అనుచర బృందానికి మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రామణ, కోరుట్ల ఎమ్మెల్యే తదితరులు హాజరయ్యారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. - Tholi Paluku