
కేసీఆర్కు సిట్ నోటీసులు?: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కీలక అడుగు వేసింది.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, విచారణ స్వాగతిస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారిందని అన్నారు.
తనతో పాటు అనేక మంది రాజకీయ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయడమే కాకుండా, వ్యక్తిగత జీవితాల్లోనూ కలహాలు సృష్టించేలా చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు పెరిగేలా చేసి, చివరకు కన్నబిడ్డలు, అల్లుళ్ల ఫోన్లను సైతం ట్యాప్ చేయించారని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా ఎంతో పేరున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ నేతలకే పరిమితం కాలేదని, ఇది అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని ఆయన మండిపడుతున్నారు.
ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని బండి తెలిపారు. ఈ అంశాలన్నింటి పైనా సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటారా? లేక పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజమైన దోషులను తేలుస్తారా? అన్నది ప్రజల్లో తీవ్ర అనుమానంగా మారిందని బండి వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అనేక టీవీ సీరియల్స్ ప్రారంభమై, అన్ని ఎపిసోడ్స్ పూర్తయ్యాయని, కానీ ఈ కేసు మాత్రం ఇంకా ముగింపుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఈ ఆలస్యం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
విచారణ అధికారులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా, వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారులు, కుట్రలు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చేవరకు దర్యాప్తు కొనసాగాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.
