Let's talk: editor@tmv.in
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

తెలంగాణ రాజకీయాల్లో అంగన్‌వాడీ ఫోన్ స్కామ్ ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. అంగన్‌వాడీ ఉద్యోగులకు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె లీగల్‌ నోటీసు జారీ చేశారు.

ఏప్రిల్ 10న బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రకారం.. అంగన్‌వాడీలకు ఇచ్చే శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర మార్కెట్‌లో తక్కువే . కానీ మంత్రి సీతక్క ఒక్కో ఫోన్ ధర రూ. 14,499 గా చూపించి కమీషన్లు తీసుకున్నారని, అంతటితో ఆగకుండా సోషల్‌ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. మొత్తం రూ. 30 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొన్నారు.

ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం జరుగుతోందని సీతక్క అన్నారు. స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు ప్రక్రియలో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టెండర్ ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, సీనియర్ అధికారులతో కూడిన టెండర్ ఈవాల్యుయేషన్ కమిటీ ద్వారా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. తాను ఆ కమిటీలో భాగం కాదని కూడా పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు.

ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్‌ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.