Let's talk: editor@tmv.in
కేరళ సీఎం మళ్లీ విజయ్‌నే: మణిశంకర్ అయ్యర్

కేరళ సీఎం మళ్లీ విజయ్‌నే: మణిశంకర్ అయ్యర్

Pinjari Chand
17 ఫిబ్రవరి, 2026

పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కేరళలో తిరిగి అధికారంలోకి వస్తుందని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ సోమవారం తన వ్యాఖ్యలకు కట్టుబడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తగా నేను యూడీఎఫ్ గెలవాలని కోరుకుంటాను. కానీ గాంధేయవాదిగా నిజం చెప్పడం నా బాధ్యత. నేను కేరళలో ఓటరును కాదు. అయినప్పటికీ విజయన్ మరోసారి పదవిలోకి వస్తారని భావిస్తున్నానని ఆయన పీటీఐ వీడియోలకు తెలిపారు. ఇక్కడ ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురించి ఉద్దేశించి అన్నారు. అయితే, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం విశేషంగా పనిచేస్తోందనే అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. స్టేట్ ప్లానింగ్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ మేరీ జోసఫ్, వి.కే. రామచంద్రన్ వివరించిన ప్రభుత్వ విజయాలు తన అభిప్రాయానికి ఆధారమని చెప్పారు. స్థానిక స్వయం పాలన శాఖ మంత్రి ఎం.బి. రాజేష్‌తో తన సంభాషణను ప్రస్తావిస్తూ, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రం కేరళేనని తనకు చెప్పినట్లు అయ్యర్ తెలిపారు. వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనే ప్రణాళికల గురించి కూడా రాజేష్ వివరించారని అన్నారు.

యూడీఎఫ్ 100కుపైగా స్థానాలు గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్పడంపై స్పందిస్తూ నేను కేరళకు చెందినవాడిని కాదు. రమేష్ చెన్నితాల అంచనాల గురించి నన్నెందుకు అడుగుతున్నారు? ఆయన రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించాల్సింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రమేనని, తనకు ఎలాంటి బహిష్కరణ లేఖ రాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తాను గౌరవించే ఏకైక నాయకుడు ప్రతిపక్షనేత వి.డి. సతీశన్ మాత్రమేనని అయ్యర్ పేర్కొన్నారు. మేమిద్దరం మాత్రమే లౌకిక సామాజికవాదులం. మేము లౌకికత, సామాజికవాదంపై రాజీపడమన్నారు. ప్రజలు ఎంతో తెలివైనవారు. ఇలాంటి ప్రభుత్వం పనిచేస్తుంటే ఎల్‌డీఎఫ్‌కే ఓటేస్తారని నేను భావిస్తున్నానని ఆయన చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలను మినహాయిస్తే ప్రతి సారి ప్రభుత్వం మారిందని, వరుసగా రెండు ఎన్నికల్లో ఓడినా ఆశ్చర్యపోనని వ్యాఖ్యానించారు.

కేరళలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తినా, తన మాటలను మీడియా అతిశయోక్తిగా చూపిందని అన్నారు. నా ప్రసంగంలో అది కేవలం అరవాక్యం మాత్రమే. దాన్ని ఎక్కువగా చూపించారని వ్యాఖ్యానించారు.

ఆయన కాంగ్రెస్‌లో లేరు

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, అవి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ స్పష్టం చేశారు. అలాగే అయ్యర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేరని తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ పరిశీలకుడిగా ఉన్న సచిన్ పైలట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. దీనిపై నేను మాట్లాడదలుచుకోలేదని ఆయన తెలిపారు.

అయ్యర్ చేసిన వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా పార్టీకి అయ్యర్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ కూడా యూడీఎఫ్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ ప్రజలు బాధ్యతాయుతమైన, పరిపాలన కోసం యూడీఎఫ్‌ను తిరిగి ఎన్నుకుంటారు. ఎల్‌డీఎఫ్, బీజేపీ మధ్య రహస్య భాగస్వామ్యం ఉందని వారికి తెలుసని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల అయ్యర్ వ్యాఖ్యలు అనవసరమని, ఆయన ఇక కాంగ్రెస్‌లో లేరని ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసిందని తెలిపారు.

కేరళ సీఎం మళ్లీ విజయ్‌నే: మణిశంకర్ అయ్యర్ - Tholi Paluku