Let's talk: editor@tmv.in
కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ నోటీసు

కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ నోటీసు

Pinjari Chand
2 డిసెంబర్, 2025

కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్బీ) మసాలా బాండ్ కేసులో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆర్థికశాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి కె.ఎం. అబ్రహాం‌లకు రూ.466.91 కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు నవంబర్ 12న ఈడీకి చెందిన ఎఫ్‌ఇఎంఏ అద్యక్ష నిర్ణయాధికారి ద్వారా జారీ చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

ప్రధాన ఆరోపణలు

2019లో కేఐఐఎఫ్బీ లండన్, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజీల్లో రుపాయి-పరిమిత మసాలా బాండ్ల ద్వారా రూ.2,672.80 కోట్లు సమీకరించింది.

2018 వరదల తరువాత రాష్ట్ర మౌలిక వసతుల కోసం ఈ నిధులు వినియోగించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, అందులోని రూ.466.91 కోట్లు భూమి కొనుగోలు కోసం వినియోగించారని, ఆ పని ఆర్బీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకమని ఈడీ పేర్కొంది. కేరళ ప్రభుత్వం ఇంతకు ముందే ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఈ కేసులో కేఐఐఎఫ్బీ చైర్మన్ హోదాలో సీఎం పినరయి విజయన్ (80), బోర్డు వైస్ చైర్మన్ గా మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్బీ సీఈఓగా కె.ఎం. అబ్రహానికి నోటీసులు ఇచ్చారు.

బోర్డుదే నేర బాధ్యత

ఈడీ జూన్ 27న ఎఫ్‌ఇఎంఏ చట్టం కింద ఫిర్యాదు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. బాండ్ల ద్వారా సమీకరించిన రూ.2,000 కోట్ల వినియోగం, ఎఫ్‌ఇఎంఏ నిబంధనల అనుసరణపై దర్యాప్తు కొనసాగిందని వివరించారు. ఎఫ్‌ఇఎంఏ ప్రకారం షోకాజ్ నోటీసులో పేర్కొన్న మొత్తం జరిమానాకు సమానమని స్పష్టం చేశారు. కేరళలో కీలక మౌలిక వసతుల నిర్మాణానికి ప్రధాన నిధుల వనరుగా కేఐఐఎఫ్బీ పని చేస్తోంది. మొత్తం రూ.50,000 కోట్ల మౌలిక నిర్మాణ ప్రణాళికలో భాగంగా తొలి మసాలా బాండ్ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరించింది.

మసాలా బాండ్ అంటే

భారత రూపాయల్లోనే విదేశీ మార్కెట్‌లో విడుదల చేసే బాండ్లను మసాలా బాండ్స్ అంటారు. భారత ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి బ్రాండ్‌ని ప్రపంచానికి చూపించేలా మసాలా బాండ్(‘ఇండియన్ ఫ్లేవర్’) అని పేరుపెట్టారు.

ఇండియన్ కరెన్సీలోనే ఈ బాండ్ విలువ ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు. సంస్థలకి విదేశాల్లోని పెట్టుబడులు రూపాయిల్లోనే వస్తాయి. కరెన్సీ రిస్క్ పెట్టుబడిదారుడిదే, భారత సంస్థకు కాదు.

కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ నోటీసు - Tholi Paluku